హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): పొద్దున ఈ పార్టీలో ఉన్న వాళ్లు రాత్రికి మరో పార్టీలో చేరడం రాజకీయాల్లో పరిపాటి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇవ్వనేలేదని ఏకంగా చట్టసభల్లో ప్రకటించడం కూడా వర్తమాన రాజకీయాల్లో సాధారణ విషయమైంది. ఇపుడు ఈ గోడదూకుడు, మాటమార్చుడు ధోరణి సమాజంలో అన్నిరంగాల వారికీ పాకుతున్నట్టు కనిపిస్తున్నది. యథారాజా తథా ప్రజా అన్నారు కదా! కొందరు రాజకీయవాదులతో తిరిగి తిరిగి ఆ జబ్బును అంటించుకున్నట్టు కనిపిస్తున్నది. పట్టపగలు మీడియా ఎదుట ఆవేశంతో బీభత్స ప్రదర్శనలు చేసి తెల్లారేకల్లా నాలుక మడత వేసిన ఒక వైనం మాత్రం ఇపుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నది. అది మూసీ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ఏర్పాటుకోసం ప్రభుత్వం కూల్చివేతలకు సిద్ధమైన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వైనమే అందుకు నిదర్శనం.
ఈ గాంధీ సరోవర్ ప్రతిపాదన బయటకు రాగానే శుక్రవారం ఇతర మీడియా ప్రతినిధులతోపాటు నమస్తే తెలంగాణ ప్రతినిధి కూడా ఆ అపార్ట్మెంట్ వాసుల వద్దకు వెళ్లారు. ఆ అపార్ట్మెంట్లో అనేకమంది మీడియా పెద్దలు, వివిధ రంగాల వీఐపీలు కూడా ఉన్నారు. ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి ఆ అపార్ట్మెంటువాసులు తమ కంటిమీద కునుకులేదంటూ ఆందోళనతో గడుపుతున్నారు. సరే.. సహజంగానే ప్రభుత్వ ప్రతిపాదనపై అక్కడి నివాసితులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు. కొందరు శాపనార్థాలు పెట్టారు. మరికొందరు కన్నీరు పెట్టుకొన్నారు.
ఈ సందర్భంగా అదే అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఎంవీ రమణారెడ్డి కూడా తన అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా నమస్తే ఎదుట తన అభిప్రాయాన్ని, ఆవేదనను వ్యక్తంచేశారు. ఉన్న ఇల్లు కోల్పోవడం, వీధిన పడాల్సిరావడం ఎవరికైనా కష్టమే. ఈ పరంపరలో భాగంగా ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ..ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే లోన్లు ఇచ్చిందని, ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే మా నివాసాలు కూలుస్తదా? అని నిలదీశారు. తమ అపార్ట్మెంట్ను కూల్చాలని చూస్తే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆయన కుటుంబ సభ్యులు సైతం తన ఆవేదనను వ్యక్తీకరిస్తున్న క్రమంలో రమణారెడ్డి ఒకింత వారించారు కూడా. ఇదంతా మధుపార్కు రిడ్జ్ అపార్ట్మెంట్వాసుల ముందే జరిగింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు సైతం ఉన్నా ‘నమస్తే తెలంగాణ’ విజ్ఞతతో వాటిని బహిరంగ పరచదల్చుకోలేదు. సరే ఆ రోజు గడిచింది.
తెల్లారేసరికి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్వాసి ఎంవీ రమణారెడ్డి అభిప్రాయం మారిపోయింది. తాను అసలు ఆ ప్రాజెక్టునే వ్యతిరేకించలేదంటూ మరో రాగం ఎత్తుకున్నారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడుతూ ‘తాను ఆ మాట అననేలేదని ‘నమస్తే తెలంగాణ’ వాళ్లే అవన్నీ రాసుకున్నారని’ అభాండం వేశారు. ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా ఒత్తిడి వచ్చిందా? లేక రాత్రికి రాత్రి పూర్తిగా మనసు మార్చుకున్నారా? అనేది తెలియదు గానీ.. అందరి ముందు స్వయంగా అన్న మాటల్ని కూడా తానలా అననేలేదని, ‘నమస్తే’నే సొంతంగా రాసుకున్నదనే రీతిలో ఆయన పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి తిరిగి శనివారం అదే అపార్టుమెంట్ వద్దకు వెళ్లి కాలనీ అసోసియేషన్ ప్రతినిధుల ముందు రమణారెడ్డి పోస్టు గురించి ప్రస్తావించారు. దీనిపై వారంతా ముక్కున వేలేసుకున్నారు. అందరి ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలంటూ మాట్లాడి ఇప్పుడు ‘నమస్తే’పై నెపం నెట్టడంపై అసహనం వ్యక్తంచేశారు. తమ సమస్యను బలంగా లేవనెత్తుతున్న మీడియాపై నిందలేయడం సరికాదని పేర్కొన్నారు. ‘ఆయన తీరు అంతే.. వదిలేయండి.. మాకు మాత్రం సహకరించండి’ అంటూ వారు కోరారు. ప్రభుత్వ ప్రతిపాదన వల్ల తమ అపార్ట్మెంట్లో నివాసముండే 450 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదమున్నదని వారంతా ఆందోళన వ్యక్తంచేశారు.