జమ్మికుంట, అక్టోబర్ 3 : కరీంనగర్(Karimnagar )జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తూ ఆరుగురిపై దాడి(Mad dog attack) చేసింది. అందులో తీవ్రంగా గాయపడిన మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హన్మకొండకు తరలించారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉపేం దర్-మీనా దంపతుల మూడేళ్ల కూతురు అక్షర ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్నది.
ఇదే సమయంలో కుక్క సదరు చిన్నారిపై దాడి చేసింది. పాప అరుపులకు బంధువులు కుక్కను తరిమి కొట్టారు. అప్పటికే అక్షరకు ముఖం, పెదవులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అదే కుక్క గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ.. స్వరూప, వెంకటస్వామి, గట్టమ్మ, రిత్విక్(బాబు)తో పాటు మరో వృద్ధురాలిని కరిచింది. కాగా, చిన్నారి అక్షరకు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హన్మకొండకు తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.