భద్రాద్రి కొత్తగూడెం, మే 9 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాలో అనర్హుల పేర్లు ఎలా చేర్చుతారని ఆగ్రహం వ్య క్తంచేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు శుక్రవారం పంచాయతీ కార్యాలయం గేటుకు తాళం వేసి బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ.. నిరుపేదలు, వితంతువులు, పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారి పేర్లు మొదటి జాబితాలో వచ్చాయని, ఆ తర్వాత ఏమైందోగానీ ఆ పేర్లన్నీ మాయమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు.
గల్లంతైన తమ పేర్ల గురించి అధికారులను నిలదీసినా సమాధానం కరువైందని వారు మండిపడ్డారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, సొంత పార్టీ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేస్తూ.. అర్హులైన నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే అర్హులైన అందరి పేర్లు ఇండ్ల జాబితాలో చేర్చాలని, లేదంటే మళ్లీ ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.