LRS | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) వన్‌టైం సెటిల్మెంట్పై ప్రజల్లో ఆదరణ తగ్గుతున్నది. గత ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా పరిష్కరిస్తామన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నది. మాటతప్పిన రేవంత్ సర్కారుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఎల్ఆర్ఎస్ కోసం 2020లో చేసుకున్న దరఖాస్తుదారులు ఎవ రూ ఇప్పుడు ఆసక్తి చూపడంలేదు. ఎల్ఆర్ఎస్ కోసం ఫీజు చెల్లించే వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉండటం గమనార్హం.
దీంతో సర్కారుకు నిధుల సమీకరణ కష్టతరంగా మారడంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు 25% డిస్కౌంట్ ప్రకటించింది. దీనికోసం మార్చి 31లోపు గడువు విధించింది. అయి నా దరఖాస్తుదారులు పట్టించుకోవడమే లేదు. వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో కనీసం 10% మంది కూడా ముందుకురాలేదు. ఎల్ఆర్ఎస్ కోసం 2020లో దాదాపు 25.60 లక్షల మంది లే అవుట్ రెగ్యులరైజేషన్ కోసం రూ.1,000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో ఇప్పటివరకు 1.90 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. ఇంకా 23.70 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వాటిలో శాఖల వారీగా తనిఖీలు చేస్తున్నారు.