హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనధికార లేఅవుట్లలో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ క్రమబద్ధం చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్కు అవకాశమివ్వాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. 2020 కన్నా ముందు ఏర్పాటైన అనధికార లే అవుట్లకు ఎల్ఆర్ఎస్కు అనుమతిస్తున్న ప్రభుత్వం ఆ తరువాత ఏర్పాటైన వాటిని ఎందుకు క్రమబద్ధం చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు 26, 2020 తరువాత ఏర్పాటైన వెంచర్లలో కొనుగోలు చేసిన లేఅవుట్లను సర్కారు రిజిస్ట్రేషన్ చేయడంలేదు.
కనీసం వాటికి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఆ వెంచర్లలోని నిర్మాణాలకు అనుమతి రియల్ వ్యాపారులు యూఎల్బీ లేదా ఆర్ఎల్బీ అనుమతులతో పాటు డీటీసీపీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకోవాలని మున్సిపల్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అలాగే సదరు లే అవుట్ రేరాలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలని పేర్కొన్నారు.