హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత (Cold Weather) పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ (Telangana) జిల్లాల్లో చలి తీవ్రత అధికమైంది. ఏజెన్సీ గ్రామాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రి కుమ్రంభీం-ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీలుగా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం పొగమంచు, చలిగాలులు వీస్తుండగా, రాత్రి సమయంలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతుందని పేర్కొన్నది.
ఈనెలలో సగటున 13నుంచి 17డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నదని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయని తెలిపింది. వచ్చే మూడ్రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వివరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం నల్లగొండ, భద్రాచలం, రామగుండం, నిజామాబాద్, హయత్‌నగర్, పటాన్చెరు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. ఈ మేరకు డీహెచ్ రవీందర్‌నాయక్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు, సీజనల్ ఫ్లూ పెరిగే అవకాశం ఉండటంతో అలర్ట్‌గా ఉండాలని సూచించారు. జ్వరం, దగ్గు, గొంతు తడి ఆరిపోవడం, నొప్పులు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. గర్భిణులు, ఐదేండ్లలోపు చిన్నారులు, వృద్ధుల్లో సీజనల్ ఫ్లూ లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని దవాఖానలను సందర్శించాలని కోరారు. అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే తక్షణమే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందాలని సూచించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 8గంటల వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు ఇలా..
