హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రానున్న 24గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో కోస్తా బంగ్లాదేశ్, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. 48 గంటల్లో పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ వాయుగుండంగా అల్పపీడనం బలపడుతుంది.
పశ్చిమ బెంగాల్, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముంది. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీస్తాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఈ నెల 19 నుంచి 25 మధ్య వెనక్కి మళ్లుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 17న తిరోగమనం మొదలై అక్టోబర్ 15 వరకు వెళ్లిపోతాయి.