Heavy Rains | హైదరాబాద్, మే 27 (నమస్తేతెలంగాణ): నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్టు పేర్కొంది. మంగళవారం ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ రాజన్న-సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది.
రాష్ట్రంలో బుధ, గురువారాల్లోపలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువొచ్చని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
గురువారం జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువొచ్చని చెప్పారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నారాయణపేట, వికారాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. నారాయణపేట జిల్లా కోస్గిలో అత్యధికంగా 6.47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.