ఎల్ఐసీ ప్రై‘వేటు’తో పాలసీదారులకు నష్టం
- అంధకారంలో ఏజెంట్లు, ఉద్యోగుల భవిష్యత్తు
- గొలుసు పద్ధతిలో ఒక్కో విభాగంపై దుష్ప్రభావం
- ‘నమస్తే తెలంగాణ’తో ఏఐఐఈఏ నేతలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): దేశానికి వెన్నెముకలా నిలుస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రభుత్వ వాటాల విక్రయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 42 కోట్ల మంది, తెలంగాణలో 1.6 కోట్ల మంది పాలసీదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎల్ఐసీ తన లాభాల్లో 95 శాతాన్ని బోనస్ రూపంలో, మరో 5 శాతాన్ని డివిడెండ్ రూపంలో పాలసీదారులకు చెల్లిస్తున్నదని, ప్రభుత్వ వాటాల విక్రయంతో బోనస్ గణనీయంగా తగ్గుతుందని ఏఐఐఈఏ డివిజనల్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, జోనల్ జాయింట్ సెక్రటరీ టీవీఎన్‌ఎస్ రవీంద్రనాథ్ మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. వాటాల విక్రయంతో పాలసీదారులకే కాకుండా ఎల్ఐసీ ఏజెంట్లకు, ఉద్యోగులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణకు రెండు దశాబ్దాల క్రితమే బీజం పడిందని, ఇప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం దానిని అమలు చేస్తున్నదని తెలిపారు.
ప్రాఫిట్ పాలసీలపై వేటు
ఎల్ఐసీ పాలసీలు రెండురకాలుగా ఉంటాయని, విత్ ప్రాఫిట్ (బోనస్‌తో కలిపి ఇచ్చే) పాలసీలతో సంస్థ యాజమాన్యానికి లాభం తక్కువ ఉంటుందని ఏఐఐఈఏ నాయకులు చెప్పారు. ఈ నేపథ్యంలో విత్ ప్రాఫిట్ పాలసీలను నీరుగార్చి వితౌట్ ప్రాఫిట్ పాలసీలను పెంచేందుకు చర్యలు చేపడతారని, దీంతో పాలసీదారులతోపాటు ఏజెంట్లు, ఉద్యోగులు మూకుమ్మడిగా నష్టపోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
ఏజెంట్ల తొలగింపునకు రంగం సిద్ధం
ఎల్ఐసీ ప్రైవేటుపరమైతే పాలసీల విక్రయాలన్నీ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించడంతోపాటు ఏజెంట్లకు ప్రోత్సాహకాలను తగ్గించి, క్రమంగా వారిని తొలగిస్తారని, ఫలితంగా వారు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఏఐఐఈఏ నాయకులు తెలిపారు. ఈ విధానం అమల్లోకి వస్తే పాలసీదారులకు సైబర్ నేరగాళ్ల బెడద కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎల్ఐసీకి దేశవ్యాప్తంగా 13.60 లక్షల మంది, తెలంగాణలో 35 వేల మంది ఏజెంట్లు ఉన్నారని, సంస్థ ప్రైవేటీకరణతో వీరందరి భవితపై అంధకారం అలుముకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల కుదింపునకు కుట్ర
ప్రైవేటీకరణ అనంతరం ఎల్ఐసీ ఉద్యోగులను దశలవారీగా కుదించవచ్చని ఏఐఐఈఏ నాయకులు అభిప్రాయపడ్డారు. డెవలప్మెంట్ ఆఫీసర్లను మొదటి దశలోనే ఇంటికి పంపవచ్చని చెప్పారు. మిగిలినవారిని హేతుబద్ధీకరణ పేరుతో పక్కనపెట్టే అవకాశం ఉన్నదని, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ లాంటి పథకాలతో ఉద్యోగులను వేధించే ప్రమాదమూ లేకపోలేదని పేర్కొన్నారు. ఇలా గొలుసుకట్టు పద్ధతిలో ఒక్కో విభాగంపై ప్రభావం పడనున్నందున ఎల్ఐసీని కాపాడుకొనేందుకు ఐక్యంగా ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని తెలిపారు. బంగారు బాతు లాంటి ఎల్ఐసీని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానీయబోమని, అందుకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

