హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): గతంలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ సర్కారు జారీచేసిన జీవో-55ను సవరించి, కాంగ్రెస్ సర్కారు జీవో-29ని తీసుకొచ్చింది. జీవో-55లోని పేరా-బీని ఇప్పటి సర్కారు మార్చింది. ఇదే ఇప్పుడు రాష్ర్టాన్ని రణరంగంగా మార్చింది. రేవంత్‌రెడ్డి సర్కారును వణికిస్తున్నది. ఈ జీవోతో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించలేదని అభ్యర్థులు మొత్తుకుంటున్నారు. జీవో-29ని రద్దు చేయకపోతే మరో రిజర్వేషన్ పరిరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నారు.
జీవో-29 ప్రకారం 1:50 డైరెక్ట్ ఓపెన్ మెరిట్ ఎంపిక విధానం ద్వారా మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపికచేశారు. ఈ ప్రక్రియలో మొదట మెరిట్‌ను అనుసరించారు. ఆ తర్వాత రిజర్వుడ్ పోస్టులకు 1:50 చొప్పున అభ్యర్థులను ఎంపికచేశారు. ఈ ప్రక్రియలో ఓపెన్ మెరిట్లో రిజర్వ్డ్ అభ్యర్థులకు అవకాశం ఉండదు. టాప్ మార్కులొచ్చినా ఓపెన్ కోటాలో అభ్యర్థిని రిజర్వేషన్ పూల్‌లోకి తోశారు. అదే మెరిట్ అభ్యర్థిని ఓపెన్ కోటాలో చేర్చితే, మరో రిజర్వ్డ్ అభ్యర్థికి అదనంగా అవకాశం దక్కేది. ఇలా రిజర్వుడు వర్గాలకు అన్యాయం జరిగిందన్నది అభ్యర్థుల ఆరోపణ.
జీవో-55 ప్రకారం ఓపెన్ కోటా ఉద్యోగాలను రిజర్వేషన్ సహా అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారిని ఎంపికచేశారు. గతంలో 209 రిజర్వ్డ్ పోస్టులకు 1:50 ఓపెన్ మెరిట్ విధానం ప్రకారం ఎంపికచేశారు. దీంట్లో ఓసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, స్పోర్ట్స్ కోటా అందరూ ఉంటారు. వీరంతా పూర్తిగా మెరిట్ విద్యార్థులే. మిగిలిన 354 రిజర్వ్డ్ పోస్టులకు 10,451 ర్యాంక్ నుంచి ఆయా రిజర్వేషన్ కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీల కులాలకు చెందిన వారిని 1:50 ప్రకారం ఎంపికచేశారు.