Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఏదైనా పని వల్ల నష్టం జరుగుతుందని తెలిస్తే ఎవరూ ఆ పని చేయరు. కానీ, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తీరు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. ధాన్యం వేలం ద్వారా ఇప్పటికే రూ.వేల కోట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆ శాఖ.. తాజాగా ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి చేయడం ద్వారా మరో భారీ నష్టాన్ని మూటగట్టుకోబోతున్నది. చేతులు కాల డం ఖాయమని తెలిసి కూడా ఈ విషయంలో ముందుకు పోతుండటం, పైగా ఇదేదో గొప్ప పని చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం పలు అనుమానాలకు, విమర్శలకు తావిస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఫిలిప్పీన్స్కు 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఒప్పందం చేసుకున్నది.
ఇందులో భాగంగా తొలిదశలో లక్ష టన్నుల బియ్యం ఎగుమతికి ఒప్పందాలు పూర్తయ్యాయి. దీంతో గత నెల 31న మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కాకినాడ రేవులో జెండా ఊపి 12,500 టన్నుల బియ్యం ఎగుమతిని ప్రారంభించారు. దీంతో ఎక్కువ ధర ఇచ్చే ఎఫ్సీఐకి బియ్యం ఇవ్వకుండా తక్కువ ధరతో ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. రేషన్ బియ్యం కోసం కిలోకు రూ.40 ఖర్చు చేస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు.
ఈ లెక్కన మన రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి అప్పగిస్తే కేజీకి రూ.40 చొప్పున చెల్లిస్తుంది. కానీ, ఇప్పుడు పౌరసరఫరాల శాఖ కేజీ బియ్యం రూ.36 చొప్పున ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేస్తున్నది. ఇది ఎఫ్సీఐ ఇచ్చే ధర కంటే రూ.4 తక్కువ. ఎఫ్సీఐకి 25% నూకతో దొడ్డు బియ్యం ఇచ్చినా ఇబ్బంది ఉండదు. కానీ, ఒప్పందం ప్రకారం ఫిలిప్పీన్స్కు కేవలం 5% నూకతో నాణ్యమైన బియ్యాన్ని ఎగుమతి చేయాలి. ఈ క్రమంలో నూకను 25 నుంచి 5 శాతానికి తగ్గించేందుకు పౌరసరఫరాల శాఖ కేజీకి రూ.3 చొప్పున మిల్లర్లకు నష్టపరిహారం చెల్లిస్తున్నది. దీనితోపాటు మిల్లుల నుంచి కాకినాడ పోర్టు వరకు రవాణా, లోడింగ్, అన్లోడింగ్ ఖర్చులన్నీ పౌరసరఫరాల శాఖే భరించాల్సి ఉంటుంది.
అందుకోసం కేజీకి రూ.2-3 వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్కన ఆ శాఖపై కేజీకి రూ.6 వరకు అదనపు భారం పడుతుంది. దీంతో ఎఫ్సీఐ ధరతో పోల్చితే కలిగే నష్టం రూ.4, అదనపు నష్టం రూ.6 కలిపి కేజీపై రూ.10 వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఫిలిప్పీన్స్ చెల్లించే రూ.36 నుంచి ఈ నష్టాన్ని తీసేస్తే కేజీ ధర రూ.26 మాత్రమే. అంటే ఎఫ్సీఐ ధరతో పోల్చితే ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి చేయడం వల్ల కేజీకి రూ.14 చొప్పున నష్టం సంభవిస్తుంది. ఈ లెక్కన క్వింటాలుకు రూ.1,400, టన్నుకు రూ.14 వేలు, తొలిదశలో ఎగుమతి చేసే లక్ష టన్నులకు రూ.140 కోట్ల నష్టం వాటిల్లుతుంది. దీనికి ఇతర ఖర్చులను కూడా కలిపితే నష్టం రూ.150 కోట్ల వరకు పెరుగుతుందని స్వయంగా పౌరసరఫరాల శాఖ అధికారులే స్పష్టం చేస్తున్నారు.
ఇంత నష్టమని తెలిసినప్పటికీ బియ్యం ఎగుమతి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం ఎగుమతికి సంబంధించిన కనీస వివరాలను ప్రభుత్వం, అధికారులు వెల్లడించకపోవడం మరిన్ని అనుమానాలను రేపుతున్నది. అసలు ఎఫ్సీఐకి ఇవ్వకుండా తక్కువ ధరతో ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, దీని వెనుక ఎవరి ‘హస్తం’ ఉందన్న ప్రశ్నలు అందరినీ తొలిచేస్తున్నాయి.
ఇప్పటికే తన వద్ద ఉన్న 38 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించిన పౌరసరఫరాల శాఖ.. ఇప్పుడు ఎగుమతి కోసం ఎక్కడి నుంచి బియ్యం సేకరిస్తున్నది? ఎఫ్సీఐకి ఇచ్చే బియ్యంలో కోత పెడుతున్నదా? అదే జరిగితే ఎక్కువ ధర చెల్లించే ఎఫ్సీఐని కాదని తక్కువ ధర వచ్చే ఫిలిప్పీన్స్ వెంట ఎందుకు పరుగులు పెడుతున్నట్టు? వేలం వేసిన ధాన్యాన్ని బిడ్డర్లు ఎత్తకపోతే ఆ ధాన్యాన్నే మిల్లింగ్ చేసి ఎగుమతి చేస్తున్నదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే కచ్చితంగా బిడ్డర్లకు మేలు చేయడమే అవుతుందని, నిబంధనల ప్రకారం ధాన్యం ఎత్తకుండా, పౌరసరఫరాల సంస్థకు డబ్బులు చెల్లించని బిడ్డర్లపై చర్యలు చేపట్టకుండా వారికి ఉపశమనం కలిగించేలా ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎగమతి చేయడం తప్పనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎగుమతి వెనుక ఎదో తతంగం నడుస్తున్నదని, దీని వెనుక ఏపీకి చెందిన ఓ బడా మిల్లర్, ఎగుమతి వ్యాపారి ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.