హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): టీజీఎస్ ఆర్టీసీలో అమలు చేస్తున్న ‘మహాలక్ష్మీ ఉచిత బస్సు’ పథకానికి సకాలంలో నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ‘మసిబూసి మారేడుకాయ’ చేస్తున్నది. ఆర్టీసీ సంస్థను నిట్టనిలువునా ముంచేందుకు కారణమవుతున్నది. మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ సంస్థకు చెల్లించాల్సిన నిధులెన్నో తెలియదు. ఇప్పటివరకు చెల్లించిన నిధులపై అవగాహన లేదు. అసలు ఎంత బకాయి పడిందో ఎరుకలేక సీఎం, రవాణా, ఆర్థికశాఖల మంత్రులు నిండు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు వల్లెవేస్తున్నారు. ‘2026-27 రాష్ట్ర బడ్జెట్లో రవాణా శాఖ గ్రాంట్ల కోసం డిమాండ్‌పై వివరణ సందర్భంగా విడుదల చేసిన పుస్తకంలో సర్కార్ దొంగ లెక్కలన్నీ బయటపడ్డాయి. అందులో వాస్తవాలను పరిశీలిస్తే.. మహాలక్ష్మీ పథకం ద్వారా సాక్షాత్తూ ప్రభుత్వమే ప్రజారవాణా సంస్థ ఆర్టీసీని ఎంతలా లూటీ చేస్తున్నదో అర్థమవుతున్నది. సర్కార్ పెద్దలు ఎంతో గొప్పగా చెప్పుకొంటున్న మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకానికి మాత్రమే నిధులు అరకొరగా విడుదల చేస్తూ.. ఇతర రాయితీలు, రుణాలకు చెల్లించాల్సిన నిధులను ఏటా ఎగ్గొడుతూ దారుణంగా దోపిడీకి పాల్పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని మహిళలకు పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించింది. ఈ పథకం ప్రారంభం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి రూ.279.97 కోట్ల సార్లు రాష్ట్రవ్యాప్తంగా మ హిళలు ఉచిత ప్రయాణాలు సాగించినట్టు ప్ర భుత్వం చాలా గొప్పగా చెప్పుకొంటున్నది. తెలంగాణ ఆడబిడ్డలు 2023 డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి 28 నాటికి ఉచిత ప్రయాణాల ద్వారా రూ.9,621.94 కోట్లు ఆదా చేసుకొన్నారని చెప్తున్నది. ఈ పథకం అమలు కింద ఆ నగదు సర్కార్ ఆర్టీసీకి చెల్లించాల్సి ఉన్నది. ప్రభుత్వం మూడు విడతలుగా రూ.5,552. 65 కోట్లు మాత్రమే ఆర్టీసీకి చెల్లించింది. 2026 ఫిబ్రవరి 28 నాటికి ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు రూ.4,069.29 కోట్లుగా తేలింది. దీంతో ఆర్టీసీపై ఎంత భారం ఉన్నదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
‘2026-27 బడ్జెట్లో రవాణా శాఖ గ్రాంట్ల కొరకు డిమాండ్‌పై వివరణ’ కోసం ప్రచురించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆ పుస్తకంలో ప్రభుత్వం 3 విడతల్లో చెల్లించిన అతి తక్కువ నిధుల గురించి చాలా వివరంగా ఇచ్చారు. ఆ పుస్తకంలో పేర్కొన్న ప్రకారం.. మహాలక్ష్మీ పథకం కింద 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి వరకూ ఆర్టీసీకి సర్కార్ ఇచ్చింది రూ.1,045 కోట్లు. 2024-25 బడ్జెట్లో కేటాయించిన రూ.3,082.53 కోట్లలో 2025 ఏప్రిల్ 30 నాటికి విడుదల చేసిన మొత్తం రూ.2,728.77 కోట్లు. 2025-26 బడ్జెట్లో కేటాయించిన రూ.3,082.53 కోట్లలో 2026 ఫిబ్రవరి 28 నాటికి విడుదల చేసిన మొత్తం కేవలం రూ.1,778.88 కోట్లు. ఇలా మూడు విడతల్లో మహాలక్ష్మీ పథకానికి విడుదల చేసింది కేవలం రూ.రూ.5,552.65 కోట్లు మాత్రమే.
మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకం కింద ప్రభుత్వం అరకొరగా నిధులు విడుదల చేస్తుండటంతో మిగతా ఆర్థిక భారమంతా ఆర్టీసీపైనే పడుతున్నది. 2024-25లో కేటాయించింది రూ.4,206 కోట్లు.. ప్రగతి పద్దులో కేటాయించినట్టు చూపించింది రూ.3,082.53 కోట్లు. 2025-26 బడ్జెట్లో రూ.4,305 కోట్లు కేటాయించగా, ప్రగతి పద్దులో కేటాయించినట్టు చూపించింది రూ.3,082.53 కోట్లు. 2026-27 బడ్జెట్లో రూ.4,305 కోట్లు కేటాయించగా, ప్రగతిపద్దులో కేటాయించినట్టు చూపించింది రూ.3,082.53 కోట్లు. 3 బడ్జెట్లలో కేటాయించింది రూ.9,247.60 కోట్లు మాత్ర మే. మహాలక్ష్మీ పథకానికే ఏటా రూ.4,250 కోట్లు అవసరం అవుతుండగా, ప్రగతి పద్దులో కేటాయించేది ఏటా రూ.3,082.53 కోట్లు మాత్రమే. విడుదలలో అంతకు తక్కువగానే ఉంటున్నది. దీంతో ఆ ఆర్థికభారమంతా ఆర్టీసీ మోయాల్సి వస్తున్నది. ప్రభుత్వ హామీ ద్వారా విద్యార్థులు, దివ్యాంగులు, జర్నలిస్టు లు, స్వతంత్ర సమరయోధులకు, కిడ్నీ పేషెం ట్లు ఇతరులకు ఆర్టీసీ రాయితీలు ఇస్తుండగా.. వాటి విలువ రూ.335 కోట్లుగా ఉన్నది. ఆ నగదు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు.
ఉచిత బస్సు ప్రయాణం కింద ఇప్పటికి రూ.6,780 కోట్లు ఇచ్చాం.
– రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్
ఉచిత బస్సు ప్రయాణానికి మా ప్రభుత్వం రూ.9,700 కోట్లు చెల్లించింది.
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఉచిత బస్సు ప్రయాణం కింద మహిళలు రూ.9,222 కోట్లు ఆదా చేసుకున్నారు.
– బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణాల ద్వారా రూ.10 వేల కోట్లు ఆదా అయ్యింది.
– మంగళవారం మంత్రి సీతక్క వెల్లడి
