హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తేతెలంగాణ): కేసీఆర్ పాలనలో యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన గురుకులాలకు కాంగ్రెస్ పాలనలో తాళాలు వేసే దుస్థితి రావడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. అద్దె బకాయిలు చెల్లించకపోవడం సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థతకు నిదర్శనమని బుధవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యాశాఖను తనవద్దే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి గురుకులాల అద్దె భవనాల బిల్లులు చెల్లించకపోవడం దారుణమని విమర్శించారు.
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే కుట్రతో పేద, దిగువ మధ్య తరగతి పిల్లల బతుకుల్లో వెలుగులు నింపిన గురుకుల వ్యవస్థను కుప్పకూల్చేందుకు ఇదంతా చేస్తున్నట్టు అనుమానం కలుగుతున్నదని అన్నారు. ఓ వైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల ఉజ్వ ల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతు న్న ముఖ్యమంత్రి సంక్షేమ గురుకులాలను సమాధి చేసే ఎత్తుగడలకు తెరలేపారని
దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కారు కుట్ర లు, కుతంత్రాలను ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ సహించబోదని హెచ్చరించారు.
రెసిడెన్షియల్ వ్యవస్థను బలిపెడితే ఊరుకోం
బీసీ, ఎస్సీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద పిల్లలకు మెరుగైన విద్యనందించిన రెసిడెన్షియల్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం బలిపెట్టే పన్నాగానికి దిగుతున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా నిండకుండానే రెండున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ప్రభుత్వం కనీసం గురుకుల భవనాల కిరాయిలు చెల్లించకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధిలేకనే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని నిప్పులు చెరిగారు. ఎడాపెడా తెచ్చిన అప్పులతో ఎవరి జేబులు నింపుతున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రజాక్షేత్రంలో బుద్ధిచెప్తాం
ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు కండ్లు తెరిచి గురుకులాల ఏడాది అద్దె బకాయిలు చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థులు నష్టపోకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ గురుకులాలకు తాళాలు వేసే దుస్థితి తీసుకువస్తే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి నిరంకుశ కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు. కేసీఆర్‌పై కక్షతో విద్యార్థుల భవిష్యత్‌ను ఫణంగా పెట్టేలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధిచెబుతామని కేటీఆర్ తేల్చిచెప్పారు.