హైదరాబాద్, సెప్టెంబర్26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వాటి భవనాల కిరాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం గత 8 నెలలుగా చెల్లించడమే లేదు. దీంతో వాటి యజమానులు విద్యాలయాలు, హాస్టళ్ల భవనాలను తాళాలు వేస్తున్నారు. ఖాళీ చేయాలని నోటీసులను పంపిస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కిరాయి బకాయిల కోసం నెలల తరబడి మొర పెట్టుకుంటున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకుండా పోయిందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం గురుకులాల సంఖ్య 1,022కు చేరుకున్నది. వాటిల్లో దాదాపు 700కు పైగా గురుకులాలు కిరాయి భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇవి గాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఎన్నో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గతంలో క్రమానుగతంగా అద్దెలను చెల్లిస్తూ వచ్చారు. అయితే గడచిన 8 నెలలుగా హాస్టళ్ల, గురుకుల భవనాల అద్దె బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడమే లేదు. గురుకులాల, సంక్షేమ హాస్టళ్ల అద్దెలను ప్రాంతాల వారీగా నిర్దేశించారు.
సగటున ఒక్కో హాస్టల్ భవనానికి నెలవారీ కనిష్ఠంగా రూ.2.50 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.14 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఆ అద్దెలను 8 నెలలుగా చెల్లించకపోవడంతో ఒక్కో భవనానికి రూ.లక్షల్లో బకాయిలు పేరుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా బకాయి బిల్లులు కోట్లలో పేరుకుపోయాయి. దీంతో హాస్టళ్లను ఖాళీ చేస్తరా? కిరాయిలు చెల్లిస్తరా? అంటూ యజమానులు అధికారులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో యజమానులు భవనాల నిర్వహణను గాలికి వదిలేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అద్దె బకాయిలు చెల్లించాలని యజమానులు, గురుకుల ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.