Haryana murder : పెళ్లైన ఐదు నెలలకే భార్య మీద అనుమానంతో ఆమెను హత్య చేశాడో సైకో భర్త. హత్యకు ఒక్క రోజు ముందు కూడా భార్యతో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడంటే ఆమె మర్డర్ విషయంలో ఎంత ప్లాన్డ్గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. భార్యను తనే హత్య చేసి, గుర్తు తెలియని వ్యక్తులు చేసినట్లుగా నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన హరియాణాలోని బహదుర్ఘఢ్లో ఫిబ్రవరి 15, ఆదివారం జరిగింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హన్సి ప్రాంతానికి చెందిన మహక్ అనే మహిళకు, హిసార్ ప్రాంతానికి చెందిన అన్షుల్ ధావన్ అనే వ్యక్తికి గత ఏడాది సెప్టెంబర్ 25న వివాహం జరిగింది. మహక్ గురుగ్రామ్‌లోని ఒక బ్యాంకులో పని చేస్తుండగా, అన్షుల్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే, మహక్‌పై అన్షుల్ ఎప్పుడూ అనుమానపడేవాడు. ఈ విషయంలో ఇద్దరిమధ్యా గొడవలు కూడా జరిగాయి. ఈ నెల 14, వాలెంటైన్స్ డే రోజు సాయంత్రం ఇద్దరూ సరదాగా గడిపారు. ఆ మరుసటి రోజు ఆదివారం రాత్రి అన్షుల్.. మహక్ గొంతు కోసి ఆమెను హత్య చేశాడు. అనంతరం ఆమె గొంతులో కూడా పొడిచాడు. ఇదంతా ముందుగానే ప్లాన్ చేసుకున్న అన్షుల్ తర్వాత అసలైన డ్రామా మొదలెట్టాడు. రాత్రి 11.00 గంటల సమయంలో పోలీసులకు ఫోన్ చేశాడు. తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు చెప్పాడు.
దొంగతనానికి ప్రయత్నించిన సమయంలో దొంగలే చంపారని చెప్పాడు. అయితే, పోలీసులు వివరాలు అడిగే క్రమంలో పొంతన లేని సమాధానాలు చెప్పాడు. మరోవైపు అక్కడ చోరీ చేసిన ఆనవాళ్లేవీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపగా.. తనే భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆధారాలు దొరకకుండా గ్లోవ్స్ ధరించినట్లు చెప్పారు. దీంతో పోలీసులు నిందితుడు అన్షుల్‌ను అరెస్టు చేశారు. మహక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా.. తన అల్లుడి ప్రవర్తనపై ముందు నుంచి అనుమానాలు ఉండేవని మహక్ తండ్రి ఆవేదనగా చెప్పాడు.