వీణవంక, ఫిబ్రవరి 1 : దుమ్ముతో ఊపిరాడక నిత్యం చచ్చిపోతున్నామంటూ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లిలో స్థానికులు ఆదివారం ఇసుక లారీలను అడ్డుకున్నారు. బస్ స్టాండ్ కూడలి వద్ద అడ్డుకోవడంతో సుమారు 3 గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్-జమ్మికుంట ప్రధాన రహదారి అచ్చంపల్లి నుంచి రెడ్డిపల్లి వరకు, రెడ్డిపల్లి నుంచి కొండపాక, పోతిరెడ్డిపల్లి వరకు ఇసుక లోడ్‌కు రాకపోకలు సాగించే లారీలు సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్డుకు రెండువైపులా నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఎన్నిసార్లు చెప్పినా తీరుమారడం లేదని, రోడ్లపై దర్జాగా లారీలు నిలిపి ఉంచడంతో కిలోమీటర్ల మేర వాహనదారులు లారీల మధ్య నుంచి భయం భయంగా ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన చెందారు. లారీలతో వచ్చే దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.