ఇల్లెందు, జనవరి 20 : తాతముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం 20 ఎకరాల స్థలాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సీఎస్పీ బస్తీలోగల డంపింగ్ యార్డు పక్కన కేటాయించింది. అధికారులు పోలీసుల సాయంతో మంగళవారం ఆ స్థలం వద్దకు వెళ్లి చదును చేస్తుండగా పలువురు రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏండ్లతరబడి ఈ భూములనే సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇప్పుడు స్కూల్ నిర్మాణమంటూ తమ భూ ములు లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. తమవద్ద ఉన్న ఆధారాలతో హైకోర్టుకు వెళితే తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని పేర్కొన్నారు.