హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9(4) ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించిన (BC Reservations) తరువాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 9ని కొట్టేయాలంటూ సోమవారం మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వికారాబాద్ జిల్లా ధరూర్ గ్రామానికి చెందిన మడివాల మచ్చదేవ రజకుల సంఘం ప్రధానకార్యదర్శి ఎన్ లక్ష్మయ్య, హైదరాబాద్ బాగ్‌లింగంపల్లికి చెందిన న్యాయవాది సీ శాంతప్ప వేర్వేరుగా పిటిషన్లు దాఖలుచేశారు. ఇదే అంశంపై మేడ్చల్ మలాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డితోపాటు మరొకరు ఇటీవల పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో తమ వాదనలు కూడా వినాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన చట్టబద్ధమేనని పేరొంటూ కాంగ్రెస్ నాయకులు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు.
కాంగ్రెస్ నాయకులు వీ హనుమంతరావు, మెట్టు సాయికుమార్, లక్ష్మణ్ యాదవ్ ఇంప్లీడ్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేయాలన్న జీవోకు చట్టబద్ధత ఉందంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు టీ చిరంజీవులు వేర్వేరుగా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటినీ కలిపి హైకోర్టు ఈ నెల 8న విచారణ చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 9(4) ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించకపోవడాన్ని, జీవో 9ని పిటిషనర్లు సవాల్ చేశారు. బీసీ రిజర్వేషన్లను వర్గీకరించాకే రిజర్వేషన్లు కల్పించాలని లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్లో పేరొన్నారు. జీవో 9లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లని మాత్రమే ఉన్నదని తప్పుపట్టారు. అనంతరామన్ కమిషన్ ప్రకారం ఆదివాసీ తెగలు, సంచారజాతులు తదితరులకు ఏడు శాతం, వృత్తిపరమైన వాళ్లకు పది శాతం, మతం మారిన క్రైస్తవులకు ఒక శాతం, ఇతరులకు ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. ప్రస్తుత రిజర్వేషన్ల జీవో 9లో అనంతరామన్ కమిషన్ సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. బీసీల్లో కొన్ని వర్గాల వాళ్లకే ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం జారీచేసిన జీవో ఉన్నదని తెలిపారు.
బీసీల్లోని నాలుగు వర్గాలే రిజర్వేషన్ల ఫలాలు కాజేస్తున్నారని, ప్రధానంగా మున్నూరు కాపు, ముదిరాజ్, యాదవ, గౌడ కులాలు మాత్రమే స్థానిక సంస్థల్లో రాజకీయ అధికారాన్ని పొందుతున్నారని వివరించారు. ఇతర బీసీ వర్గాల వారు పేదలుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీల్లో అందరికీ న్యాయం జరగాలంటే చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించాలని కోరారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల పదవులకు ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీచేయాలని విజ్ఞప్తిచేశారు. అప్పటివరకు జీవో 9ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీచేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్లను సమర్థిస్తూ దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లలో సుప్రీంకోర్టు తీర్పు విద్య, ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఉన్నదని గుర్తుచేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం పరిమితి దాటిపోయిందని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ప్రభుత్వం జీవో 9 జారీ చేసిందని తెలిపారు. అన్ని వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ చేయనుంది.