హైదరాబాద్, మార్చి 18 (నమస్తేతెలంగాణ): ‘అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేశాం.. మా పని అయిపోయిందని చేతులు దులుపుకోవద్దు.. పార్లమెంట్లో బిల్లు కోసం కేంద్రం వెంటపడి 42% కోటా సాధించాలి.’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు కిశోర్‌గౌడ్, కురువ విజయ్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. తమిళనాడు మాదిరిగా బలహీనవర్గాలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లోనే కాకుండా అన్నిరంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీల అభ్యున్నతి గురించి పదే పదే మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకొనే అవకాశం వచ్చిందని చెప్పారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం పొందేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో కాంగ్రెస్‌కు సహకరించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. 42% బీసీ కోటా సాధించిన తర్వా తే స్థానిక సంస్థలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మే రకు బడ్జెట్లో బీసీలకు సబ్‌ప్లాన్ తెచ్చి రూ. 20 వేల కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. కేంద్రం ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సూచించారు.