Local Body Elections | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగా ణ): స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పట్లో ముహుర్తం కుదిరేలా కనిపించటం లేదు. ప్రభు త్వం, ముఖ్యమంత్రి నుంచి ఎన్నికలపై ఎలాం టి స్పందన లేకపోవటంతో ఈ మధ్య ఎన్నికలు నిర్వహించటం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోర్టు జోక్యం చేసుకొని ఆదేశాలు ఇస్తే తప్ప ఎన్నికలు జరిగేలా లేవని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలకు పాలకవర్గాల సమ యం ముగిసింది. వచ్చే నెలలో ఎంపీటీసీ స భ్యులు, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుల, జడ్పీ చైర్మన్ల పదవీ కాలం ముగియనున్నది. ఈ నేపథ్యంలో వీటన్నింటికీ వరుసగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది.
మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. కోడ్ ఎత్తేసి వారం గడిచినా కనీస స్థాయిలోనూ ఎన్నికలపై చర్చ జరగటం లేదని అధికారులు, రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోతే నిధులు కూడా నిలిచిపోతాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వంలో కదలికలేదని వి మర్శిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. బీసీల రిజర్వేషన్‌పై సకాలంలో ప్రభుత్వాలు స్పందించకుంటే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి మిగిలిన సీట్ల అన్నింటినీ జనరల్ క్యాటగిరీ సీట్లుగా పరిగణించి ఎన్నికలు నిర్వహించాలని గతంలోనే సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణ యం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మా రింది. సీఎం ఆదేశాల కోసం బీసీ కమిషన్, పం చాయతీరాజ్‌శాఖ, ఎన్నికల కమిషన్ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ మంత్రి స్థానిక సంస్థల ఎన్నికల గురించి సీఎంను అడిగినా చూద్దాం అని పొడిపొడి సమాధానం వ చ్చిందని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసిం ది. మరోవైపు.. సర్పంచ్‌లు లేక గ్రామ పంచాయతీల్లో పాలక పడకేసింది. స్పెషల్ ఆఫీసర్లతో పాలన సాగిస్తున్నారు. ఆర్థిక భారం తాము మోయలేమని పంచాయతీ కార్యదర్శులు చేతులెత్తేశారు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల పనులు ముందుకు సాగటం లేదు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఇప్పటికే పలువురు వ్యక్తులు, సంఘాలు, అసోసియేషన్లు కోర్టు మెట్లెక్కాయి. ఈ కేసు జనవరి నుంచి కొనసాగుతున్నది. ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు, ఇతర కారణాలను చూపుతూ వాయిదా కోరుతూ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని వేసవి సెలవులకు ముం దే కోర్టు ఆదేశాలు జారీ చేసి, కేసును జూలై 2కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తిరిగి కేసు జూలై 2న కోర్టు ముందుకు రానున్నది. ప్రభుత్వ అఫిడవిట్, దానిపై కోర్టు జారీ చేసే ఆదేశాలపైనే ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఎన్నికల నిర్వహణకు సిద్ధమని ఈసీ ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది.