హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్లో చేరికల జోష్ కనిపిస్తున్నది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ గులాబీ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతున్నది. పట్టణం నుంచి పల్లె దాకా రాష్ట్రవ్యాప్తంగా చేరికల పర్వం ఊపందుకున్నది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను వీడి ప్రతిపక్షంలో ఉన్న కారు పార్టీలో చేరుతుండటం చర్చనీయాంశమైంది. పెద్దసంఖ్యలో పార్టీలో చేరికలతో గులాబీ శ్రేణుల్లో కదనోత్సాహం నెలకొన్నది. రానున్న పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేస్తామనే ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నది. శనివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బీఆర్ఎస్లో చేరికల పర్వం కొనసాగింది.
మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట మండలానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ తాడేపు మహిపాల్, నీరడి సత్యం, సాయిబాబ, న్యాయవాది శ్రీనివాస్, గాలి మల్లేశం, మేకల మల్లయ్య, కిషన్, గణపతి, వెంకటేశ్ తదితరులు శనివారం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తన నివాసంలో గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కరీంనగర్ జిల్లా వల్భాపూర్‌కు చెందిన గౌడ సంఘం మాజీ అధ్యక్షులు వడ్లకొండ చిరంజీవి, మోటపోతుల చంద్రమౌళి, బీజేపీ బూత్ అధ్యక్షుడు బుర్ర రామస్వామి, నాయకులు బీఆర్ఎస్లో చేరగా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో వాంకిడి మాజీ జడ్పీటీసి అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్ నియోజకవర్గం బొంరాస్‌పేట మండలం ఏర్పుమల్ల గ్రామానికి చెందిన 20మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాగా చేవేళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. బొబ్బిలిగామకు చెందిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తన నివాసంలో వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఎములోనిపల్లికి చెందిన 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జనగామ జిల్లా దేవరుప్పులకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
మహబూబాబాద్ జిల్లా కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఉమ్మడి వేంనూరు శివారు ఇందిరానగర్‌కు చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లికి చెందిన 20 కుటుంబాలు సోడే సుధాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. వీరికి పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.