Elections | జగిత్యాల, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పదో తరగతి, ఇంటర్, ఇతర పరీక్షలు సమస్యాత్మకంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు లేకుండా సరిగ్గా విద్యా సంవత్సరం ముగింపు దశలో, పరీక్షల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఎన్నికల సంఘానికి సూచించడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది.
ఇప్పటికే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు, పదో తరగతి విద్యార్థులకు ఫార్మెటివ్ అసెస్మెంట్కు సంబంధించిన 20 మార్కుల స్థిరీకరణ ప్రక్రియ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బందిగా నియమిస్తున్నామని, శిక్షణ తరగతులకు హజరు కావాలంటూ అధికారుల నుంచి ఆదేశాలు వస్తుండటంతో జూనియర్ లెక్చరర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. అధికారులు సైతం ఏం చేయాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు 17 వరకు కొనసాగనున్నాయి. మార్చి 5 నుంచి ఇంటర్ థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతికి సంబంధించిన కీలకమైన ఫార్మెటివ్ అసెస్మెంట్ మార్కుల స్థిరీకరణ జరుగుతున్నది. ఈ ఫార్మెటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులను సగటున లెక్కించి, 20 మార్కులుగా వేయాల్సి ఉంటుంది. ఈ నెల 10న ప్రారంభమైన ఈ ప్రక్రియను 18వ తేదీ వరకు పూర్తిచేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, పదో తరగతి ఫార్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు నడుస్తున్న తరుణంలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రిట్నరింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ముందుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. బుధ, శుక్రవారాల్లో ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ ఇస్తున్నారు. అన్ని జిల్లాల్లో గెజిటెడ్ అధికారులను ఆర్వో, ఏఆర్వోలుగా నియమించి, శిక్షణకు హజరుకావాలని ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 14, 15, 16, 17, 18 తేదీల్లో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేవారంతా ఈ శిక్షణకు హజరుకావాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో జూనియర్ లెక్చరర్లు, గురుకులాలు, మాడల్ స్కూల్స్, కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్న పీజీటీలను మినహాయించాలని ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్ ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు సమాచారం. పరీక్షల సమయంలో ఎన్నికల విధుల్లోకి తీసుకుంటే ఇబ్బంది అవుతుందని ఆ లేఖలో వివరించినట్టు తెలుస్తున్నది. పాఠశాల విద్యాశాఖ అధికారులు సైతం ఎన్నికల విధుల నుంచి తమను మినహాయిస్తేనే బాగుటుందని చెప్తున్నట్టు సమాచారం. కనీసం స్కూల్ అసిస్టెంట్లనైనా మినహాయించాలని కోరుతున్నట్టు తెలుస్తున్నది. అయితే, టీచర్లను, లెక్చరర్లను మినహాయిస్తే ఎన్నికల నిర్వహణ దాదాపు అసాధ్యమని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
పరీక్షలు, ఎన్నికల నిర్వహణ శిక్షణ తరగతుల నేపథ్యంలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. కొన్ని జిల్లాల్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా హెడ్మాస్టర్లు, జూనియర్ లెక్చరర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆర్వో, ఏఆర్వో డ్యూటీలు వేస్తే, తాము కనీసం వారం రోజులు ఆయా విధుల్లో ఉండాల్సి ఉంటుందని, ఇది పరీక్షల నిర్వహణకు తీవ్ర విఘాతం కలిగిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఆర్వో, ఏఆర్వోలుగా నియమితులైన వారు శిక్షణ తరగతులకు హాజరుకావడంతోపాటు కేటాయించిన ప్రాదేశిక నియోజకవర్గంలో నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, విత్డ్రాతోపాటు ఎన్నిక పూర్తయి, గెలుపుపత్రం అందించే వరకు ఎన్నికల విధుల్లో ఉండాల్సి వస్తుందని, చాలా రోజులపాటు కాలేజీలకు, స్కూల్స్‌కు దూరంగా ఉంటే పరీక్షల నిర్వహణ విషయంలో తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్తున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఎన్నికల శిక్షణ తరగతులు నిర్వహిస్తుండటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. పరీక్షలు ముగిసి, మూల్యాంకనం పూర్తయి, ఫలితాలు ప్రకటించిన తదుపరి ఏప్రిల్, మే మాసాల్లో ఎన్నికలు నిర్వహిస్తే పిల్లలకు, ఉపాధ్యాయులకు సౌకర్యంగా ఉంటుందందని సూచిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలకే ముందుకెళ్తే విద్యారంగాన్ని ముంచివేయడమే అవుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.