హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహుల హంగామా నడుస్తున్నది. ఓటర్లకు దావత్ల జోరు కొనసాగుతున్నది. దసరా పండుగతో మరింత ఊపందుకున్నది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగవనే అనుమానాలున్నా.. ఊరూరా జోరును పెంచింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డుల స్థానాల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు ఇప్పటినుంచే తాము పోటీ చేస్తున్నామని ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. దర్జాగా దావత్లు ఇస్తూ మురిసిపోతున్నారు. గ్రామ కూడళ్లలో దసరా, దీపావళి శుభాకాంక్షల పేరిట పెద్ద పెద్ద ఫ్లెక్ల్సీలు వెలిశాయి.
వినాయక చవితి, నవరాత్రి మండపాలకు ఆశావహులు చందాలను ఇచ్చేశారు. దసరా మరుసటిరోజున యువతను మచ్చిక చేసుకునేందుకు ముక్క, చుక్కతో దావత్లు ఇచ్చారు. ఓటరు జాబితాలు ప్రింట్ చేసి ఒక్కో కుటుంబాన్ని లెక్కిస్తూ, ఓట్లు ఎవరికి పడుతాయనే అంచనాలతో ఊహల పల్లకిలో ఊరేగుతున్నారు. గతంలో పోటీచేసి ఓడిన అభ్యర్థులు ఈసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. ‘ఆనాడు ఓడిన.. ఈ సారైనా గెలిపించండి’ అంటూ నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ ఆశావహుడు ఇంటింటికీ తిరుగుతున్నాడు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు జీవోపై హైకోర్టు 8న విచారణ అనంతరం ఎన్నికల ఊగిసలాట తేలిపోనున్నది.