BC Reservations | కాచిగూడ, జూన్ 10 : రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, స్థానిక సంస్థలు నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల పట్ల తమ విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని కోరారు. మంగళవారం బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో వివిధ సంఘాలతో అఖిలపక్ష సమావేశాన్ని కాచిగూడ అభినందన హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి బీసీలలో ఉన్న ఐక్యతను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేలా చట్టపరమైన రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. శతాబ్దాల క్రితమే కుల గణన వచ్చిందని, ప్రస్తుతం రాజకీయ పార్టీలు వారికి అనుగుణంగా బీసీలను పావులాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి పాలకవర్గాలతో బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నీల వెంకటేష్, జిల్లాపల్లి అంజి, కోల జనార్దన్, మణికంఠ, అనంతయ్య, రాజేందర్, రాజు నేత, సతీష్, మోది రాందేవ్, నరేష్ గౌడ్, శివ యాదవ్, లింగ ముదిరాజ్, శారద గౌడ్, లక్ష్మి, లత, మల్లేష్ పటేల్, బాలయ్య, బలరాంతోపాటు 40 కుల బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.