Congress Govt | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదంతా వరుస ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తద్వారా సంవత్సరం మొత్తం ‘ఎన్నికల కోడ్’ నీడలో గడిపేయాలని ప్రణాళికలు రచించినట్టు చెప్తున్నారు. తద్వారా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలును దాదాపు ఏడాదిపాటు వాయిదా వేయవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఈ నెల 26వ తేదీన ప్రభుత్వం 4 పథకాలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. రైతు భరోసా, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్‌కార్డుల ప్రారంభోత్సవానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఆ తర్వాత వరుసగా ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఈ ఏడాది ఇవే కొత్త పథకాలని, మరే సంక్షేమ పథకాలు అమలుకాకపోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.
ఎమ్మెల్సీ నుంచి మున్సిపాలిటీ వరకు..
ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ ఉన్నాయి. నిరుడు ఫిబ్రవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలన నడుస్తున్నది. గతేడాది మార్చి నుంచి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ఎన్నికల నిర్వహణకు వెనుకడుగు వేసింది. బీసీ రిజర్వేషన్ల పెంపు, డెడికేటెడ్ కమిషన్ పేరుతో మరికొంత కాలం గడిపింది. చివరికి.. వచ్చే నెలలో స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి నోటిఫికేషన్ వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నది.
మార్చి రెండోవారం వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కోడ్ వెలువడుతుందని సమాచారం. దీంతో ఏప్రిల్ వరకు ఎన్నికల కోడ్ కొనసాగనున్నది. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఐదు, స్థానిక సంస్థల నుంచి ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవుతాయి. ఈ ప్రక్రియ ఆగస్టు వరకు కొనసాగుతుందని తెలుస్తున్నది. మరోవైపు పురపాలక సంఘాల పాలక మండళ్ల పదవీకాలం ఈ నెల 26తో ముగియనున్నది. ఆ మరుసటి రోజు నుంచే ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమవుతుంది. పురపాలక సంఘాల ఎన్నికలను ఆగస్టు తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. తద్వారా మరో రెండు నెలలపాటు ఎన్నికల కోడ్ కొనసాగుతుందని అంటున్నారు. ఇలా ఏడాది చివరి వరకు కోడ్ కొనసాగనున్నది.
ఉద్యోగ నోటిఫికేషన్లూ కష్టమే?
ఏడాదంతా ఎన్నికల నేపథ్యంలో మ్యానిఫెస్టో అమలుకు ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపే అవకాశం ఉన్నదని చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఇతర హామీలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ఏడాది దాటినా అమలు చేయలేదని మండిపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ఆదాయం అంతకంతకూ పడిపోతుండటంతో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వెచ్చించలేని పరిస్థితి.
దీంతో వీటన్నింటికీ ‘కోడ్’ సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఈ ఏడాది బడ్జెట్లో కొత్త పథకాల ప్రకటన, హామీల అమలుకు కేటాయింపులు ఉండవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా కష్టమే అని, ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి కూడాఅనుమానమేనని చెప్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరితో జీహెచ్ఎంసీ పాలక వర్గం పదవీ కాలం ముగియనున్నది. అప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే.. 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తం ఎన్నికల కోడ్ మాటున గడిపినట్టు అవుతుందని అంచనా వేస్తున్నట్టు సమాచారం.