Runa Mafi | హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీపై ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కారు పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేకపోయింది. ఆగస్టు 15లోపు రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీని పాక్షికంగానే అమలుచేసింది. వివిధ కారణాలు, షరతులతో రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులను మర్చిపోయింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఆగస్టు 15లోపు రైతులందరికీ రుణమాఫీ కాలేదు. అసంపూర్తిగా మాఫీ చేస్తే మొత్తం మాఫీ ఎలా అవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రూ.2 లక్షలకుపైగా రుణాలున్న రైతులకు కూడా రుణమాఫీ చేసి ఉంటే, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నదనే ఖ్యాతి దక్కేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆగస్టు 15లోపు రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి, ‘హామీ నిజం.. అమలు అబద్ధం’ అనే విమర్శను ప్రతిపక్షాల నుంచి ఎదుర్కోవాల్సి వస్తున్నది.
31 వేల కోట్లకు చేసింది 17 వేల కోట్లే!
ప్రభుత్వ లెక్కల ప్రకారం 32.5 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉన్నది. కానీ, 22.2 లక్షల మందికి రూ.17,869 కోట్లు మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసింది. ఇంకా 10.3 లక్షల మందికి మాఫీ కాలేదు. వీరికి ఇంకా రూ.13,131 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉన్నది. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు మాఫీ చేసింది. రెండో విడతలో రూ.1.5 లక్షల వరకు రుణం గల 6.40 లక్షల రైతులకు రూ.6,190 కోట్లు మాఫీ చేయగా, మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణం గల 4.46 లక్షల రైతులకు రూ.5,644 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఈ విధంగా నెల వ్యవధిలో మూడు విడతల్లో కలిపి 22.2 లక్షల రైతులకు రూ.17,869 కోట్లను మాఫీ చేసింది. ఇంతకు రెండింతల మంది రుణ విముక్తులు కాలేకపోయారు.
48 లక్షల మంది రైతులకు నష్టం
ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ అని ప్రకటించిన రేవంత్‌రెడ్డి, అధికారంలోకొచ్చాక నిబంధనలు విధించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేయడంతో దాదాపు 48 లక్షల మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్‌కార్డు లేకున్నా, ఆదాయ పన్ను చెల్లించినా, అక్షర దోషాలున్నా, చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న, పెన్షన్ పొందుతున్న వారికి కూడా రుణమాఫీ కాలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 10.30 లక్షల మందికి మాఫీ కాలేదు. వాస్తవ లెక్కలు పరిశీలిస్తే, ఈ సంఖ్య అంతకు నాలుగింతలు ఉంటుంది. రాష్ట్రంలో రుణాలు తీసుకున్న రైతులు 70 లక్షల మంది ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కానీ, మూడు విడతల్లో కలిపి 22.2 లక్షల మందికే రుణమాఫీ చేయడంతో ఇంకా 48 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాకపోవడం గమనార్హం.
పెరిగిన రైతులు, సాగు, పంట రుణాలు..
రాష్ట్రంలో 2018తో పోల్చితే ప్రస్తుతం రైతుల సంఖ్య, సాగు భూమి విస్తీర్ణం పెరిగింది. దీంతో పంట రుణాలు తీసుకున్న వారి సంఖ్య కూడా పెరిగింది. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా కాంగ్రెస్ సర్కారు రుణమాఫీలో రైతుల సంఖ్య భారీగా తగ్గించింది. రూ. లక్ష రుణం తీసుకున్న రైతుల సంఖ్యతో పోల్చితే రూ. 2 లక్షల రుణం తీసుకున్న వాళ్ల సంఖ్య సహజంగానే ఎక్కువ ఉండాలి. కానీ ఇందులోనూ సర్కారు మాయ చేసింది. 2018లో రైతుబంధు లెక్కల ప్రకారం రైతుల సంఖ్య 50 లక్షలు మాత్రమే. క్రమేనా ఈ సంఖ్య పెరిగింది. ప్రస్తుతం రైతుబంధు లెక్కల ప్రకారం రైతుల సంఖ్య సుమారు 70 లక్షలు. అంటే గడిచిన ఆరేండ్ల కాలంలో 20 లక్షల మంది రైతులు పెరిగారు. దీంతో పాటు రాష్ట్ర ఏర్పాటు సమయంలో సాగు భూమి విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా ప్రస్తుతం ఇది 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. గడిచిన ఆరేండ్లలో సుమారు 32వేల కోట్ల పంట రుణాలు పెరిగాయి. 2018-19లో బ్యాంకులు రైతులకు రూ. 33వేల కోట్ల పంట రుణాలను మంజూరు చేస్తే గతేడాది రూ. 65వేల కోట్లు మంజూరు చేశాయి.
‘లక్ష’ మాఫీకి 36లక్షల మంది.. 2 లక్షలకు 22 లక్షలేనట!
2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్ష వరకు రుణమాఫీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం 36.68 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. కాంగ్రెస్ సర్కారు రూ. 2 లక్షల రుణమాఫీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంతో పోల్చితే కాంగ్రెస్ రుణమాఫీకి రైతుల సంఖ్య పెరగాలి. కానీ తక్కువగా ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. కాంగ్రెస్ సర్కారు 22.37 లక్షల మందికే రూ.2 లక్షల రుణమాఫీ చేసింది. అంటే బీఆర్ఎస్ లక్ష రుణమాఫీతో పోల్చితే కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీలో 14.31 లక్షల మంది రైతులు తగ్గడం గమనార్హం. బీఆర్ఎస్ రూ. లక్ష రుణమాఫీకి రూ. 19,198 కోట్లు కావాలని అంచనా వేస్తే కాంగ్రెస్ సర్కారు రూ. 2 లక్షల రుణమాఫీని రూ. 17,933 కోట్లతోనే పూర్తిచేసింది. బీఆర్ఎస్ లక్ష రుణమాఫీతో పోల్చితే కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీకి రూ.1265 కోట్లు తగ్గడం గమనార్హం.
40 వేల కోట్ల నుంచి 17వేల కోట్లకు
తొలుత రుణమాఫీకి రూ. 40వేల కోట్ల వరకు అవసరమవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత రూ. 31వేల కోట్లు అని చెప్పారు. ఇక బడ్జెట్లో మాత్రం రూ. 26వేల కోట్లని పేర్కొన్నారు. అప్పుడే రుణమాఫీ నిధులపై అందరికీ సందేహాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలను బలపరుస్తూ చివరికి ప్రభుత్వం చేసిన రుణమాఫీ కేవలం రూ. 17,933 కోట్లు మాత్రమే. దీనిద్వారా ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయలేదని తేటతెల్లమైంది.
ఇదేనా మాఫీ?