Mahabubabad | నర్సింహులపేట, ఆగస్టు 22: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ పరిధిలో పంట రుణాలు తీసుకున్న రైతులు రుణమాఫీ కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజులపాటు ఆడిట్ పేరుతో రుణమాఫీ డబ్బులు రెన్యూవల్ చేయకపోవడంతో రైతులు బ్యాంకు వద్ద బారులు తీరారు. దీంతో రుణమాఫీ రెన్యూవల్‌కు సంబంధించి గురువారం ఉదయం 30 మంది మాత్రమే బ్యాంక్ అధికారులు టోకెన్లు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 30 మందికి మాత్రమే రెన్యూవల్ చేస్తే ఇంత మందికి ఎన్ని రోజుల్లో చేస్తారు? బ్యాంకు చుట్టూ ఎన్ని రోజులు తిరగాలి? అని ఆవేదన చెందుతున్నారు. ఎస్బీఐ పరిధిలో సుమారు 2800 మంది రుణం తీసుకుంటే 1200 మందికి మాత్రమే రుణమాఫీ అయిందని అధికారులు చెప్తున్నారు.
జన్నారం, ఆగస్టు 22: రుణం మాఫీ చేసేందుకు ఎస్బీఐ కాంట్రాక్ట్ ఉద్యోగి లంచం డిమాండ్ చేసిన ఘటన గురువారం మంచిర్యాల జిల్లా జన్నారంలో జరిగింది. హాస్టల్ తండాకు చెందిన మ్యాక ఎర్రయ్యకు రూ.1.5 లక్షల రుణమాఫీ అయినట్టు జాబితాలో వచ్చింది. అయితే, రూ.20 వేల లంచం ఇస్తేనే మాఫీ చేస్తామని బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి పరంకుస సాయిరామ్ స్పష్టంచేశాడు. దీంతో గురువారం మధ్యాహ్నం రైతు ఎర్రయ్య ఆ ఉద్యోగికి రూ.15 వేలు ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రైతులు బ్యాంక్ వద్దకు చేరుకొని మేనేజర్ మహేశ్‌తో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సాయిరామ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.