మేడ్చల్, ఆగస్టు16(నమస్తే తెలంగాణ): మూడో విడత రుణమాఫీ జాబితాలోనూ స్థానం దక్కని రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మూడో విడతలో భాగంగా రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్నవారిలో 342 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. జిల్లాలో రుణమాఫీకి అర్హులైన రైతులు 30 వేల పైచిలుకు ఉన్నప్పటికీ, మూడు విడతల్లో కలిపి 3,436 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రుణమాఫీ పథకం కింద రూ.22 కోట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో ‘మేము రైతులం కాదా?’ అంటూ ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గ్రీవెన్స్‌సెల్ దరఖాస్తులకు స్పందన కరువైందని రైతులు అంటున్నారు.
ఐటీ కట్టిన వారు రైతులు కాదా?
ఐటీ కడుతున్న వారికి రుణమాఫీ వర్తింపచేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఐటీ కడుతున్న వారు రైతులు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. రేషన్‌కార్డులు లేని వారికి కూడా రుణమాఫీ చేయలేదన్న ఆరోపణలను ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. 3 విడతల్లోనూ రుణమాఫీ పొందని రైతులకు మరో జాబితాలోనైనా రుణమాఫీ చేస్తారో లేదో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
రేవంత్ రాజీనామా చేయాలి ; బొమ్మెర రామ్మూర్తి డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం 41 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తానని కనబడిన దేవుళ్లపై ఒట్టేసి చెప్పి రైతులను మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ మాజీ ఇన్చార్జి బొమ్మెర రామూర్తి డిమాండ్ చేశారు. రూ.18 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి, రైతుల నోట్లో మట్టికొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి భేషరుతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మాట ఇచ్చింది, మోసం చేసింది, మాట తప్పింది, పచ్చి అబద్ధాలు ఆడుతున్నది రేవంత్‌రెడ్డి అని, హరీశ్‌రావును రాజీనామా చేయాలని అడిగే హకు, అర్హత రేవంత్‌కు లేదని స్పష్టంచేశారు. ఇప్పటి వరకు అమలు చేసిన ఒకటో రెండో గ్యారెంటీలనైనా సక్రమంగా అమలు చేశారా? అని ప్రశ్నించారు.