Congress Govt | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ‘మీరు పంట రుణాలు రెన్యువల్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరి రుణాలను మాఫీ చేస్తాం.’ ‘ఆగస్టు 15లోగా రైతులందరినీ రుణ విముక్తులను చేస్తాం.’.. ఇవీ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు వల్లెవేసిన వ్యాఖ్యలు. కానీ, సోమవారం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం అవన్నీ గాలిమాటలేనని, రుణమాఫీ సగం మందికి కూడా అందడం కష్టమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గణాంకాలతో సహా వివరిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో సుమారు 55 లక్షల మంది పంట రుణాలు తీసుకున్నట్టు వ్యవసాయ శాఖ వర్గాల అంచనా. రుణమాఫీకి పీఎం కిసాన్ యోజన మార్గదర్శకాలను అమలుచేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు 33 లక్షల మంది ఉన్నారు. ఈ డాటాను చివరగా 2019లో అప్డేట్ చేశారు. అప్పటినుంచి ఈ పథకానికి అర్హులైన వారి సంఖ్య ఐదేండ్లలో మరో ఐదు లక్షల వరకు పెరిగి ఉంటుందని అంచనా.
ఈ లెక్కన పీఎం కిసాన్ నిబంధనలకు అనుగుణంగా 38 లక్షల మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. కుటుంబాన్ని నిర్దారించేందుకు రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం చెప్తున్నది. ఈ లెక్కన 38 లక్షల మందిలోనూ రేషన్‌కార్డు లేనివారికి రుణమాఫీ దక్కదు. కొత్త రేషన్‌కార్డులు రాకపోవడం వల్ల ఇప్పటికీ లక్షల కుటుంబాలు ఒకే కార్డులో ఉన్నాయి. ఇలా దాదాపు 10 లక్షల మంది వరకు రుణమాఫీకి దూరం అవుతారని వ్యవసాయ శాఖ వర్గాలు చెప్తున్నాయి. అంటే సుమారు 28 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ దక్కనున్నదని వ్యవసాయ, ఆర్థిక శాఖల నిపుణులు పేర్కొంటున్నారు. రుణం తీసుకున్న 55 లక్షల మందిలో సగం మందికి మాత్రమే రుణమాఫీ అందే అవకాశం ఉన్నదని స్పష్టం చేస్తున్నారు. ‘సాధారణంగా ప్రభుత్వాలు ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా అర్హతలు నిర్ణయిస్తుంటాయి. కానీ, రుణమాఫీ మార్గదర్శకాల్లో వీలైనంత ఎక్కువ మందిని అనర్హులను చేసేందుకే నిబంధనలు పెట్టినట్టున్నది’ అని ఒక బ్యాంకర్ పేర్కొన్నారు.