Rythu Runa Mafi | నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్: రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోతున్నా.. క్షేత్రస్థాయి లో వేల మంది రైతులకు ఇంకా మాఫీ కాలేదని తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎందుకు మాఫీ కాలేదని.. అటు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ, ఇటు బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. రుణమాఫీ అయినవాళ్లూ మిత్తి పైసలు కట్టేందుకు నానా కష్టాలు పడుతున్నారు. వడ్డీ కడితేనే మాఫీ అని బ్యాంకులు తెగేసి చెప్పడంతో దిక్కులేక కొత్తగా అప్పు తెచ్చి మరీ కడుతున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో పరిస్థితి..అంతా అయోమయం.. గందరగోళం.వాస్తవ సంఖ్య కు రుణమాఫీ అయిన వారి సంఖ్యకు రెట్టిం పు స్థాయిలో వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం. మెదక్ జిల్లాలో 31 పీఏసీఎస్‌లు ఉన్నాయి. డీసీసీబీ నుంచి రుణాలు తీసుకున్న రైతులందరికీ రూ.లక్షలోపు రుణమాఫీ కాలేదు. రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్నవారు 18,239 మంది ఉండగా, వారిలో 9,271 మందికి మాత్రమే మాఫీ అయినట్టు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్లో 250 మందికి పైగా రైతులు రూ.లక్ష లోపు రుణం తీసుకున్నవారే.రుణమాఫీ జాబితాలో 86 మంది రైతుల పేర్లు మాత్రమే కనిపించాయి. జగిత్యాల జిల్లాల్లోని ఇండియన్ బ్యాంక్ శాఖల్లో 6 వేల మందికి పైగా రైతులు రుణం పొందగా, 2,500 మందికి పైగా రూ.లక్షలోపు రుణం ఉన్నవారి పేర్లు కనిపించలేదు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 226 మంది రైతుల పేర్లు జాబితాలో లేవు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని క్యాతూరులో రూ.లక్ష రుణాలు ఉన్న రైతులు 240 మంది ఉండగా, 200 మందికి మాఫీ కాలేదు. ములుగు జిల్లాలోని మూడు, జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని ఒక పీఏసీఎస్ పరిధిలోని రైతులకు రుణమాఫీ కాలేదు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట సొసైటీ కింద 16 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులు 4,200 మంది ఉండగా ఒక్కరికీ మాఫీ కాలేదని ఆందోళన చెందుతున్నా రు.
మహబూబాబాద్ జిల్లా బేతవోలులో రూ.లక్ష లోపు రుణాలు 120 మంది తీసుకోగా, కేవలం 15 మందికే రుణమాఫీ వర్తించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-టీ మండలంలోని ప్రాథమిక సహకార సంఘంలో 388 మంది రైతులు రూ. లక్షలోపు రుణాలు తీసుకున్నారు. వీరిలో ఎవరికి రుణమాఫీ అయిందో.. ఎవరికి కాలేదో సహకార బ్యాంకు అధికారులకూ సమాచారం లేదు. తిర్యాణి మండలంలోని ప్రాథమిక సహకార సంఘం ద్వారా 462 మంది రైతు లు రూ.లక్షలోపు రుణం పొందినవారు ఉన్నా రు. వీరిలో 197 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. కౌటాల ప్రాథమిక సహకార సంఘంలో సుమారు 600 మంది రైతులు లక్షలోపు రుణాలు తీసుకున్నవారు ఉండగా, వీరిలో 349 మందికే మాఫీ అయింది.
తిప్పి తిప్పి.. మాఫీ కాలేదన్నరు!
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామానికి చెందిన చట్టు సురేశ్ బావుపేటలోని ఇండియన్ బ్యాంకులో గతంలో రూ.30 వేల పంట రుణం తీసుకున్నాడు. మూడేండ్ల కింద కేసీఆర్ ప్రభుత్వంలో ఇది మాఫీ అయ్యింది. ఈ భరోసాతో మళ్లీ రూ.68 వేల రుణం తీసుకున్నాడు. గతేడాది ఆగస్టు 10న తాను తీసుకున్న రుణం తిరిగి చెల్లించి కొత్తగా మరో రూ.68 వేలు తీసుకున్నాడు. ఈ సారి కూడా తనకు రుణమాఫీ వర్తిస్తుందని ఆశించిన సురేశ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపింది. మాఫీ జాబితాలో తన పేరు లేకపోవడంతో మొదట స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసి అడిగారు. రెండు, మూడురోజుల్లో మరో జాబితా వస్తుందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పడంతో నాలుగైదు రోజుల తర్వాత తిరిగి అదే అధికారిని అడిగాడు. బ్యాంకుకు వచ్చి ఉంటుంది, వెళ్లి అడగాలని చెప్పడంతో సురేశ్ అక్కడికి వెళ్లి అడిగారు. బ్యాంకు అధికారులు వ్యవసాయ అధికారులకే తెలుసని, జాబితా తీసి చూపించారు.
అందులో తన పేరు లేదనే సంగతి తెలిసిన సురేశ్ నిరాశగా వెనుదిరగడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ తనకెంతో మేలు చేసిందని చెబుతున్న సురేశ్.. ఈ ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని వాపోతున్నాడు. అతనొక్కడే కాదు.. గ్రామానికి చెందిన 20 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. బావుపేటలోని ఇండియన్ బ్యాంకులో పంట రుణాలు తీసుకున్నవారికెవరికీ ఖాతాల్లో డబ్బులు పడలేదు. ఈ బ్యాంకులో రుణం తీసుకున్న దాదాపు 700 మంది రైతుల్లో ఏడుగురికే మాఫీ అయినట్టు బ్యాంకు అధికారులు చెప్తున్నారు. కేడీసీసీబీ నుంచి రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులు 61మంది ఉంటే, కేవలం 36 మందికే రుణమాఫీ వర్తించింది.
వృద్ధాప్యంలో అధికారుల చుట్టూ తిరుగుతూ..
జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల గంగు, వృద్ధాప్యానికి చేరువగా వచ్చిన మహిళ. అయినా వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నది. తనకు ఉన్న భూమిని ఇద్దరు కొడుకులు, కూతురికి పంచి ఇచ్చిన గంగు.. తన కోసం 1.37 ఎకరాల వ్యవసాయ భూమిని ఉంచుకొన్నది. ఆ భూమిలో మక్కజొన్న పంటను సాగు చేస్తున్నది. రెండేండ్ల క్రితం పంట రుణంగా రూ.55 వేలు తీసుకొన్నది. క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూ వస్తున్నది. రూ.లక్షలోపు రుణం మాఫీ అవుతుందని ప్రకటించగానే సంబురపడ్డది. కానీ, జాబితాను తన పేరు లేకపోవటంతో గంగు హతాశురాలైంది. వ్యవసాయ శాఖ ఏఈవో, బ్యాంకు అధికారులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని గోడు వెల్లబోసుకున్నది.
బ్యాంకోళ్లు డబ్బులు వసూలు చేశారు..
నేను ఎకరన్నర పొలంపై రూ.60 వేల రుణాన్ని తీసుకున్నా. లోన్‌ను వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని, లేదంటే రెన్యూవల్ కాదని బ్యాంకువాళ్లు అన్నారు. జూన్‌లో రూ.60 వేల అసలు, వడ్డీ రూ.1,800 కట్టాను. మళ్లీ నాకు రూ.67 వేల రుణం మంజూరు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రకటించిన రూ.లక్ష లోపు రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. నాతోపాటు అదే నెలలో రెన్యూవల్ చేసుకున్నవారి పేర్లు జాబితాలో ఉన్నాయి.
– సదాశివయ్య, క్యాతూరు గ్రామం, అలంపూర్ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా
లక్షలోపే ఉన్నా ఎందుకు కాలే..?
నేను కోటగిరి ఎస్బీఐలో 2023 అక్టోబర్‌లో రూ.88వేల రుణం తీసుకున్నా. ఇటీవల ప్రభుత్వం రూ.లక్షలోపు లోన్ తీసుకున్న వారికి రుణమాఫీ చేసినట్టు చెప్పడంతో బ్యాంకుకు వెళ్తే..నీకు మాఫీ కాలేదని అధికారులు చెప్పిన్రు. ఎలాగైనా మాఫీ అవుతుందనుకున్నా.. కానీ నాకున్న రూ.88 వేలు క్రాప్‌లోన్ ఎందుకు మాఫీ కాలేదో అర్థం కావడం లేదు. ఎవరిని అడగాలో.. ఏం చేయాలో తెలుస్తలేదు.
– పొమ్మెడి రాములు, రైతు, కోటగిరి, నిజామాబాద్ జిల్లా
ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తమని చెప్పిన్రు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిన్రు. రూ.లక్షలోపు మాఫీ చేసినా.. మాకైతే కాలే. పెట్టుబడి సాయానికి రూ.80వేల లోన్ తీసుకున్న. మాఫీ కాకపోవడంతో ప్రతిరోజూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్న. అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. లోన్ మాఫీ అయితదన్న నమ్మకం కూడా పోయింది.
-షేక్ యాకూబ్ పాషా, బేతోలు, మహబూబాబాద్ జిల్లా
మా ఊళ్లో చాలా మందికి మాఫీ కాలే
నాకు ఎకరం ఐదు గుంటల భూమి ఉంది. సాగుకు భిక్కనూరు మండలం జంగంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రూ.83వేలు రుణం తీసుకున్న. నా పేరు మొదటి విడత జాబితాలో ఉంటుందనుకున్న. కానీ రాలే. నాతోపాటు మా ఊళ్లో చాలా మందికి రూ.లక్షలోపే రుణాలున్న మాఫీ కాలే. రైతులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.
– చెన్నప్పగారి ప్రభాకర్‌రెడ్డి, రైతు, జంగంపల్లి, నిజామాబాద్ జిల్లా
65 వేల రుణం కూడా మాఫీ కాలె
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష రుణమాఫీ పథకం మాకు వర్తించలేదు. నా పేరు మీద సహకార సంఘం బ్యాంకులో రూ.65 వేల రుణం మాత్రమే ఉన్నా, అదీ కాలేదు. అధికారులను అడిగితే సహకార బ్యాంకులో రుణాలు తీసుకున్న రైతులందరి పేర్లు ప్రభుత్వానికి పంపించాం అని అంటున్నారు. కాంగ్రెస్ గిట్ల అన్యాయం చేస్తదనుకోలె.
– దందె చంద్రు, వెంట్రావ్పేట్, సిర్పూర్ మండలం, కుమ్రంభీం ఆసిఫాబాద్
రుణమాఫీ ఉత్తదే
రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం గొప్పలు చెబుతున్నది. మొదటి విడత వేశామన్నారు. అంతా ఉత్తదే. మా గ్రామాల్లోని రైతులకు రుణమాఫీ అయినట్టు మెసేజ్‌లు రాలేదు. నేను చెన్నారావుపేట సొసైటీలో రూ.35 వేలు రుణం తీసుకున్నా. కానీ నాకు రుణమాఫీ కాలేదు. సొసైటీకి వెళ్లి అడి గితే కాలేదని చెబుతున్నరు. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు.
– అనుముల కుమారస్వామి, రైతు, ఖాదర్‌పేట, వరంగల్ జిల్లా
రూ. 9వేల మిత్తి కట్టించుకున్రు..
నర్సాపూర్‌లోని ఎస్బీఐలో నాకు రూ. 90879 రుణమాఫీ అయ్యింది. అదనంగా రూ. 9వేల ఇంట్రెస్ట్ కడితేనే రుణం క్లియర్ అవుతుందని బ్యాంకు సిబ్బంది చెప్పిన్రు. ఇదేంటని అడిగితే కలెక్టర్‌ను, అగ్రికల్చర్ ఆఫీసర్‌ను అడగండి..మాకేం సంబంధంలేదంటున్రు. చేసేదేమీ లేక మొత్తం కట్టేసిన. బ్యాంకు అధికారులు చాలామంది నుంచి వడ్డీ కట్టించుకుంటున్రు.కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల చేయలే. రేవంత్‌రెడ్డి లక్ష మాఫీ అంటూనే..అదనంగా వడ్డీల రూపంలో డబ్బులు దండుకుంటున్రు.
-సాదు ఆంజనేయులు, రైతు, అల్లీపూర్, శివ్వంపేట మండలం, మెదక్ జిల్లా
రైతుబంధు రాలే.. రుణమాఫీ కాలే
బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతుబంధు, రుణమాఫీ అన్ని చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ పథకానికి కొర్రీలు పెడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిన తర్వాత కొత్తగా దౌల్తాబాద్ ఇండియన్ బ్యాంక్‌లో రూ.52 వేలు మళ్లీ తీసుకున్న. ఇప్పుడు రుణమాఫీకి ఏవో సాంకేతిక కారణాలు చెబుతున్రు. మరి అప్పుడు రుణమాఫీ అయ్యిందిగా…అప్పుడు లేని లోపాలు ఇప్పుడే ఎందుకొచ్చినయో అధికారులు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వం వచ్చాకా రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు. ఇదేనా ప్రజాపాలన.
-వెంకట్‌రెడ్డి, రైతు, నస్తీపూర్, సంగారెడ్డి జిల్లా
కారణాలు తెలియవంటున్నారు
2022లో మద్దూరు ఏపీజీవీబీ బ్యాంక్‌లో రూ.80 వేల రుణాన్ని రెన్యూవల్ చేశాను. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన లిస్టులో నా పేరు లేదు. ఇదే విషయాన్ని బ్యాంక్ మేజేజర్ దగ్గర అడిగితే నీ పేరు లిస్టులో రాలేదని, వ్యవసాయశాఖ అధికారులను కలువాలని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే తమకు కూడా కారణాలు తెలియవని అంటున్నారు.
-బొమ్మ ఐలయ్య, రైతు, రేబర్తి, మద్దూరు మండలం, సిద్దిపేట జిల్లా
మా సొసైటీలో ఎవరికీ కాలే..!
నేను సొసైటీలో రూ.75 వేల రుణం తీసుకున్న. ఇప్పటివరకు నాకైతే రుణమాఫీ కాలే. రేపు మాపు అంటున్నరు. ఇంత వరకు మెసేజ్ కూడా రాలే. ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తమని హామీ ఇవ్వడంతో ఓట్లేసినం. ఇప్పుడేమో సవాలక్ష నిబంధనలు పెడుతున్నరు. ఇది సరికాదు. రైతులందరికీ మాఫీ చేయాలి. అసలు వడ్డీ కలిపి లెక్కలు వేయడం సరికాదు. మా గ్రామంలో చాలామంది చెన్నారావుపేట సొసైటీలో సభ్యులుగా ఉన్నరు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న సభ్యులెవరికీ కూడా మాఫీ కాలేదు. ప్రభుత్వం త్వరగా రుణమాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలి.
– గుర్రం రవి, చెన్నారావుపేట, వరంగల్ జిల్లా
కాంగ్రెస్ సర్కారు మోసం చేసింది
నా పేరు మీద రూ.35 వేలు, నా భార్య ఓదెమనుబాయి పేరు మీద రూ. 50 వేల పంటరుణం ఉన్నది. ఇద్దరిలో ఒక్కరికీ రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది.
– ఓదె పత్రు, వెంకట్రావ్‌పేట్, సిర్పూర్ మండలం, కుమ్రంభీం ఆసిఫాబాద్
సంతోషం.. నీరుగారింది
గజ్వేల్ మంజీరా బ్యాంక్‌లో నాలుగేండ్ల కిందట రూ.55 వేల పంట రుణం తీసుకున్న. ఒకసారి రెన్యువల్ చేయించిన. మొన్న ప్రభుత్వం రూ.లక్షలోపు రుణమాఫీ చేస్తామని చెప్పంగనే సం తోషం అనిపించింది. కానీ లిస్టులో నా పేరు రాలె. సంతోషం నీరుగారింది.
-లింగ నర్సింలు, మైలారం, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా