వనపర్తి, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశామని చెప్తున్నా.. ఎక్కడా పూర్తిస్థాయిలో మాఫీ అయిన దాఖలాలు కనిపించడం లేదు. అందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత గ్రామంలో జరిగిన రుణమాఫీ తీరే ఉదాహరణ. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడలో మొత్తం 2,194 మంది రైతు కుటుంబాలున్నాయి. ఈ గ్రామానికి చెందిన రైతులు కొప్పునూరు సహకార సంఘం, పెంట్లవెల్లి మండలం జటప్రోల్ యూనియన్ బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్నారు. కొప్పునూరు సంఘంలో 180 మంది క్రాప్లోన్లు తీసుకుంటే.. వీరిలో 120 మందికి మాత్రమే మాఫీ వర్తించింది. పెంట్లవెల్లి మండలం జటప్రోల్ యూనియన్ బ్యాంక్ నుంచి 1,600 మంది రుణం పొందితే.. వీరిలో 1,050 మందికి మాఫీ అయ్యింది.
ఇంకా 550 మందికి రుణాలు మాఫీ కాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా గ్రామంలో రుణాలు తీసుకున్న మొత్తం రైతులు 1,780 మంది ఉంటే.. 1,170 మందికి మాత్రమే మాఫీ వర్తించిందని వ్యవసాయ శాఖ లెక్కలు చెప్తున్నాయి. దీని ప్రకారం.. పెద్దదగడలో ఇంకా దాదాపు 40 శాతం రైతులకు పంట రుణాలు మాఫీ కావాల్సి ఉంది. వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ వారి బాధలు తొలగడం లేదు. అన్ని అర్హతలు ఉండి కూడా మాఫీ రాని రైతుల పాట్లు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. రేషన్ కార్డులు లేవని, ఆధార్లో తప్పులున్నాయని కొందరి పేర్లు లిస్టులో లేకపోవడంతో.. రుణమాఫీ పెద్ద దగా అంటూ రైతులు మండిపడుతున్నారు.
మాఫీ చేయలే..
నాకు ఎకరా 20 గుంటల భూమి ఉంది. దీనిపై 50 వేల పంట రుణం తీసుకున్నా. మాఫీ లిస్టులో నా పేరు రాలేదు. బ్యాంకులో అడిగితే మీ తండ్రి పేరుతో కూడా రుణం ఉందంటున్నా రు. ఇద్దరిది కలిపి రూ.2.08 లక్షలని చెప్తుండ్రు. ప్రభుత్వం రూ.2 లక్షలిస్తే.. రూ.8 వేలు మేము కట్టుకుంటం. అధికారుల చుట్టూ తిరిగి అలసిపోతున్నాం. మా బాధలు అర్థం కేసుకుని రుణమాఫీ చేయండి.
-కంచి శివ, యువ రైతు, పెద్దదగడ
వస్తే ఇస్తాం అంటున్నరు
నాకు ఆరెకరాల పొలం ఉంది. 2 లక్షల రుణం తీసుకున్నా. మాఫీ లిస్టులో నా పేరు లేదు. ఎందుకు లేదని సొసైటీ వద్దకు వెళ్లి అడిగితే.. లిస్టులో వస్తే ఇస్తాం.. రాలే దు అంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. ఈ గోస మాకు అర్థం కావడం లేదు. మీరు చెప్పిన 2 లక్షల మాఫీ చేస్తే.. మాకు ఇదంతా దండగ ఉండదు. మాఫీ చేస్తామని చెప్పి చివరకు మా కడుపులో మంటలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.
-బాలీశ్వరయ్యగౌడ్, రైతు, పెద్దదగడ
మళ్లీ దరఖాస్తు చేసుకోవాలట
నాకు ఐదెకరాల 12 గుంటలున్నది. జటప్రోల్ బ్యాంకులో రూ.1.75 లక్షల రుణం తీసుకున్నా. మాఫీ లిస్టులో నా పేరు లేదు. అధికారులను అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. మేమూ రైతులమే.. మాకూ అప్పు ఉంది. ఒక ఊరిలోనే ఇలా ఇన్ని తేడాలు చూపుతున్నారు. 2 లక్షల వరకు మాఫీ అన్నరు. అది చేస్తే మిమ్మల్ని మళ్లా అడుగుతామా? ఈ సర్కారు చేసేది ఒకటి.. చెప్పేది మరోటి అన్నట్టు ఉంది. -చేపల సహదేవుడు, పెద్దదగడ గ్రామం