హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రూ.2 లక్షల రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, మార్గదర్శకాల పేరుతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నదని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీకి తెల్ల రేషన్‌కార్డు ప్రామాణికం కాదని ఇటీవల పేర్కొన్న సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు రోజులు తిరగకుండానే నాలుక మడతేశారని విమర్శించారు. రేషన్‌కార్డులేని రైతుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. ప్రభుత్వ మార్గదర్శకాలు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మార్గదర్శకాలు అధికారులు, రైతుల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని, అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగేలా ఉన్నాయని దుయ్యబట్టారు. రుణమాఫీపై రైతుల నుంచి ఫిర్యాదులను కోరడం వెనుక రైతుల మధ్య వివాదాలను సృష్టించే ఎత్తుగడ ఉన్నదని ఆరోపించారు. రుణమాఫీ ఆశచూపి అధికారం దకించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీల నుంచి తప్పించుకునేందుకు సాకులు వెతుకుతున్నదని మండిపడ్డారు.
సర్కారు దగ్గర కిసాన్ డాటా ఉంటే రుణమాఫీ అమలుకు వ్యవసాయ శాఖ అధికారులను బాధ్యులను చేయడం ఎందుకు? రైతుల నుంచి ఫిర్యాదులు ఆహ్వానించడం ఎందుకు? అని ప్రశ్నించారు. ‘డిసెంబర్ 9నే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. పూచీ నాది. రుణాలు తెచ్చుకోనివారు పరుగెత్తి తెచ్చుకోండి’ అని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి మార్గదర్శకాల పేరుతో రైతులకు ఇప్పుడు చావుకబురు చల్లాగా చెప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు చేసిన మోసానికి రైతులు తప్పకుండా గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం అసలు రుణమాఫీయే చేయలేదని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు రుణమాఫీ అమలు చేశామనే పేరు కోసం, ప్రచారం కోసం తప్ప రైతుల మేలుకోరేవి కావని స్పష్టంచేశారు. రాష్ట్రంలో రూ.2 లక్షల రుణం పొందిన రైతులు ఎంతమంది ఉన్నారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ డాటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడం, రైతాంగాన్ని వంచించడమేనని మండిపడ్డారు.
కేసీఆర్ చేసిన రుణమాఫీ 29,144 కోట్లు 
రాష్ట్రంలో వ్యవసాయం, రైతాంగం బాగుండాలి తద్వారా ఉపాధి అవకాశాలు లభించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలుచేసిందని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరంటు, సాగునీళ్లు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలను అమలుచేశామని వివరించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో రైతులు, వ్యవసాయమే ఇరుసుగా పనిచేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పడిన రైతుల రుణభారాన్ని తొలగించడం ద్వారానే రైతులు కుదుటపడతారని, వ్యవసాయం సుస్థిరం అవుతుందని భావించి కేసీఆర్ రెండు విడతలుగా రుణమాఫీ చేశారని చెప్పారు.
మొదటి విడతలో 35.31 లక్షల మంది రైతులకు రూ.16,144.10 కోట్లు, రెండో విడతలో 22,98,039 రైతులకు చెందిన రూ.13,000.51 కోట్లు రుణమాఫీ చేశామని వివరించారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు కేసీఆర్ ప్రభుత్వంలో రూ.6,440 కోట్లు మిగిలిపోయిందని చెప్పారు. రెండు విడతల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.29,144.61 కోట్లు రుణమాఫీ చేసిందని తెలిపారు. రైతు కుటుంబాలను గుర్తించేందుకే రేషన్‌కార్డును పరిశీలించామని, కాంగ్రెస్ సర్కారు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 10 ఎకరాలుండి గులాబీ కార్డు ఉన్న రైతులందరికీ వర్తించదా? అని ప్రశ్నించారు.