నవంబర్ 19, (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో త్వరలో మద్యం ధరలు పెరగనున్నాయి. ఆ పెంచబోయే ధరల మాటున భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది. చట్టానికి చిక్కకుండా ఖజానాను కొల్లగొట్టే చక్కని వ్యూహం రచించినట్టు సమాచారం. అస్మదీయ డిస్టిలరీలకు, బ్రూవరీలకు, సప్లయ్ కంపెనీలకు కోరిన బేసిక్ ధరలు చెల్లించడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. డిస్టిలరీలు ప్రతి పెట్టెకు రూ.50 వరకు అదనపు ధర చెల్లించాలని కోరుతుండగా.. ప్రభుత్వం మాత్రం రూ.75 వరకు చెల్లించేందుకు సిద్ధపడుతున్నట్టు తెలిసింది. అదే జరిగితే.. ఈ చెల్లింపులో సగం డబ్బు డిస్టిలరీలు, బ్రూవరీలకు పోగా.. మిగిలిన సొమ్మంతా పాలకుల జేబుల్లోకి తిరిగిరానున్నది. సగటున ఒక్కో పెట్టెపై రూ.30 నుంచి రూ.35 వరకు వైట్ మనీ రూపంలో జేబుల్లోకి చేరనున్నది. రాష్ట్రంలో నెలకు సగటున 35 లక్షల కేసుల లిక్కర్, 40 లక్షల కేసుల బీరు అమ్ముడుపోతున్నది. ఈ లెక్కన నెలకు కనీసం రూ.26 కోట్ల చొప్పున నాలుగేండ్లకు రూ.1260 కోట్లకు పైగా దోపిడీకి స్కెచ్ వేసినట్టు తెలిసింది. ఇందుకోసం పొరుగు రాష్ట్రం క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని టీఎస్బీసీఎల్లోకి చొప్పించి వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నట్టు సమాచారం. ఈ మేరకు మద్యం ధరల సవరణతో కూడిన ఫైల్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఫైనల్ అప్రూవల్ కోసం వేచి ఉంది. మహారాష్ట్ర ఎన్నికల అనంతరం మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నది.
ప్రస్తుతం పొరుగు రాష్ట్రంలో మద్యం ధరలు చాలా ఎక్కుగా ఉన్నాయి. తెలంగాణ మద్యం ధరలతో పోలిస్తే కనీసం 25 నుంచి 30 శాతం వరకు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు అవే ధరలను తెలంగాణలో అమలు చేయనున్నారు. ఉదాహరణకు తెలంగాణలో ఎక్కువగా అమ్ముడుపోయే ఓ బ్రాండ్ మద్యం ఫుల్‌బాటిల్ ధర ఇక్కడ రూ.840 ఉండగా.. పొరుగు రాష్ట్రంలో రూ.920గా ఉంది. సవరించిన ధరలలో సింహభాగం మద్యం కంపెనీలకే చెల్లించనుండగా.. ఆయా కంపెనీలు తమ సొమ్ము పోను, మిగిలిన కమీషన్‌ను నేతల ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిసింది. రెండు పక్కపక్క రాష్ర్టాల మద్యం ధరలు, డిస్టిరీలకు చెల్లింపులు, సుంకాలు ఒకే తరహాలో ఉంటే న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు. కాగ్ కూడా పొరుగు రాష్ట్రాల ఎమ్మార్పీ, బేసిక్ ధరలను సరిపోల్చి నివేదికలు రూపోందిస్తుంది. ఈ నేపథ్యంలో అటు చట్టానికి, కాగ్ లాంటి కేంద్ర ఆడిట్ సంస్థలకు దొరక్కుండా ఉండటం కోసం పక్కా పాలసీని అమలు చేయనున్నట్టు సమాచారం.
తమకు చెల్లించే బేసిక్ ధరలు పెంచాలని డిస్టిలరీలు, బ్రూవరీలు, లిక్కర్ సప్లయ్ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దేశీయ మద్యం తయారీ కంపెనీలు (డిస్టిలరీలు) టీఎస్‌బీసీఎల్‌కు విక్రయించే ధరలను బట్టి చీప్ లిక్కర్, మీడియం లిక్కర్, ప్రీమియం లిక్కర్‌గా నిర్ధారిస్తారు. ఇవి కాకుండా విదేశీ మద్యం అదనం. డిస్టిలరీలకు చీప్ లిక్కర్‌పై పెట్టెకు (12 ఫుల్ బాటిల్స్) రూ.450 లోపు, మీడియం లిక్కర్‌కు రూ.750, ప్రీమియం లిక్కర్‌కు రూ.750 కన్నా ఎక్కువగా టీఎస్‌బీసీఎల్ చెల్లిస్తున్నది. ప్రీమియం (స్ట్రాంగ్) బీర్ల పెట్టెకు రూ 313.78, లేగర్ (లైట్) బీర్ల పెట్టెకు రూ.289.22 చొప్పున చెల్లిస్తున్నది. చీప్ లిక్కర్‌కు, బీరుకు బేసిక్ మీద రూ.100, మీడియం, ప్రీమియం మద్యం మీద రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా చెల్లించాలని మద్యం కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ మేరకు సానుకూల నిర్ణయాలు తీసుకునే దిశగానే అడుగులు పడుతున్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం ధరలు పెంచటానికే మొగ్గు చూపింది. ఇందుకోసం ఒక కమిటీని వేసింది. ఇక్కడే మద్యం కంపెనీ సిండికేట్లు తమ తెలివిని ప్రదర్శిస్తున్నారు. పొరుగు రాష్ట్రం ముఖ్యనేత కనుసన్నల్లోనే తెలంగాణ బ్రూవరీస్ కార్పొరేషన్లో వ్యవహారాలు సాగుతున్నట్టు తెలుస్తున్నది. ఆయన తనకు అత్యంత నమ్మకమైన సీనియర్ ఐఏఎస్‌ను టీఎస్బీసీఎల్లోకి పంపినట్టు సమాచారం. ఆయన మద్యం కంపెనీలకు బేసిక్ ధర ఎంత చెల్లించాలనే అంశంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పొరుగు రాష్ర్టాల్లో అమల్లో ఉన్న మద్యం ధరలు, డిస్టిలరీలకు, బ్రూవరీలకు చెల్లిస్తున్న ధరలతో సరిపోలుస్తూ.. తెలంగాణ ప్రభుత్వం మద్యం కంపెనీలకు చెల్లించాల్సిన బేసిక్ ధరను సూచిస్తూ ఫైల్ సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆ ఫైల్ ముఖ్యమంత్రి వద్ద ఉన్నట్టు తెలిసింది.