Liquor Prices | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ధరల నిర్ణయ కమిటీ సూచనలను, మద్యం కంపెనీల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం రూపొందించిన నివేదికపై కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తదితరులు సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది.
సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటన ముగించుకొని వచ్చే నాటికి లిక్కర్ ధరల పెంపు ఫైల్ ఆయన టేబుల్ మీద పెట్టే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. పెంచబోతున్న మద్యం ధరలతో ఏడాదికి రూ.2000 కోట్ల మేర అదనపు రాబడి వస్తుందని అంచనా వేసినట్టు తెలిసింది. మద్యం సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం జూన్ 30తో ముగియనున్నది. దీంతో జూలై ఒకటి నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ లోపే మద్యం ధరలు పెంచి, డిస్టిలరీలు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లయ్ కంపెనీలతో ఒప్పందాలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది.
పొరుగు రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో చీప్ లిక్కర్ ధర ఎక్కువగా ఉంది. ఇంకా ధరలు పెంచితే చీప్ లిక్కర్ వ్యాపారం కుప్పకూలిపోతుందని దీనికితోడు పొరుగు రాష్ర్టాల నుంచి ఎన్డీపీఎల్ మద్యం, ఫేక్ లిక్కర్ అక్రమ రవాణా పెరిగిపోతుందని ఎక్సైజ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చీప్ లిక్కర్ ధరలను నియంత్రణలో ఉంచాలని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ సూచించినట్టు తెలిసింది. ధరలు పెంచకుండా ప్రభుత్వ ఆదాయం పెరిగేలా కర్ణాటక తరహాలో టెట్రా ప్యాకెట్లను ప్రవేశపెట్టాలని ఆయన సూచించినట్టు తెలిసింది. దీని ద్వారా ప్రతి క్వార్టర్ మీద కనీసం రూ.15 నుంచి రూ.20 వరకు తగ్గుతాయని పేర్కొన్నట్టు సమాచారం.
రెండు స్లాబుల్లో లికర్ ధరలను పెంచే సూచనలతో కూడిన నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికి అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చీప్ లిక్కర్ బ్రాండ్లను యథాతథంగా ఉండనిచ్చి మిగిలిన మూడు క్యాటగిరీల లిక్కర్‌పై ధరలు పెంచాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ధరల నిర్ణయ కమిటీ 15 శాతం నుంచి 20 శాతం వరకు ధరలు పెంచవచ్చని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను 15 శాతం వరకు పెంచుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చింది.