Liquor Price | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రెండు తెలుగు రాష్ర్టాల మధ్య లిక్కర్ బంధం మంచి కిక్కుమీదున్నట్టు తెలుస్తున్నది. అస్మదీయ డిస్టిలరీలకు, బ్రూవరీలకు, సప్లయ్ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టే దగ్గర నుంచి, చట్టానికి, వైరిపక్షానికి దొరకకుండా ఖజానాను కొల్లగొట్టే మార్గాల అన్వేషణ వరకు అన్ని నిర్ణయాలు కూడబలుక్కొనే జరుగుతున్నట్టు సమాచారం. మొత్తంగా మద్యం ధరలను పెంచేసి.. ఆ పెంచిన మొత్తంలో సింహభాగం మద్యం కంపెనీలకే దక్కేలా విధానాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది. పొరుగు రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విధానానికి తుదిరూపునిస్తున్నారు. అది పూర్తవగానే.. దానికి తగ్గట్టుగా తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నది. మరో పక్షం రోజుల్లో ప్రతి క్వార్టర్ లిక్కర్ ధరను కనిష్ఠంగా రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.160 వరకు పెంచే అవకాశం ఉంది.
ధరలు పెంచాలని కోరుతున్న కంపెనీలు
తమకు చెల్లించే బేసిక్ ధరలు పెంచాలని డిస్టిలరీలు, బ్రూవరీలు, లిక్కర్ సరఫరా కంపెనీలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. ఇతర రాష్ర్టాల్లో రెండేండ్లకోసారి మద్యం ధరలను పెంచుతుండగా, తెలంగాణలో గత కొన్నేండ్లుగా పెంచలేదనేది మద్యం కంపెనీల వాదన. మద్యం కంపెనీలకు కోరిన ధర చెల్లించటం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా కాగ్ (కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్) తప్పు పడుతుంది. న్యాయస్థానాల్లో కేసులు పడతాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం ధరలు పెంచటానికే మొగ్గు చూపుతున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. మద్యం కంపెనీలు సిండికేటుగా ఏర్పడి పొరుగు రాష్ట్రం నుంచి వ్యవహారం నడిపిస్తున్నట్టు నమ్మకమైన సమాచారం అందింది. అక్కడి అగ్రనేత కనుసన్నల్లోనే తెలంగాణ బ్రూవరేజస్ కార్పొరేషన్ (టీజీబీసీఎల్)లో వ్యవహారాలు సాగుతున్నట్టు తెలిసింది.
ధరల కమిటీలో అనుచరుడు
తెలంగాణలో మద్యం ధరలను నిర్ణయించటానికి టీజీబీసీఎల్ ఏర్పాటుచేసిన కమిటీలో అనూహ్యంగా పొరుగు రాష్ట్రం అగ్రనేతకు అనుంగునిగా ముద్ర ఉన్న రిటైర్డ్ బ్యూరోక్రాట్‌ను సభ్యునిగా చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం అతడిని కీలక హోదాలో నామినేట్ చేసింది. తాజాగా ఆయనకే మద్యం ధరలను నిర్ణయించే బాధ్యతలు అప్పగించారు. జూలై 18న సమావేశమైన ఈ కమిటీ.. మద్యం కంపెనీలు తమ డిమాండ్ ధరలను కోట్ చేస్తూ సీల్డ్ కవర్ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో 91 కంపెనీలు మద్యం సప్లయ్ చేయటానికి ముందుకు వచ్చాయి. మొత్తం 1032 బ్రాండ్లకు ధర కోట్ చేశాయి. ఇందులో 755 బ్రాండ్లు పాతవే కాగా, మరో 277 కొత్త బ్రాండ్లకు టెండర్లు పడ్డాయి. కొత్త వాటిలో సోం డిస్టిలరీతో పాటు కర్ణాటక, గోవా, మహారాష్టకు చెందిన డిస్టిలరీలు, 20 వరకు హైదరాబాద్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్న లోకల్ కంపెనీలు ఉన్నాయి. వివాదాస్పద సోం డిస్టిలరీకి తొలుత అనుమతినిచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత ప్రతిపక్షాల విమర్శలతో వెనక్కి తగ్గి అనుమతిని తాత్కాలికంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఏపీలో ధరలు మనకన్నా ఎక్కువే
ప్రస్తుతం ఏపీలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఎంత తగ్గించినా అది చీప్ లిక్కర్‌కే వర్తిస్తుంది. అక్కడి ధరలకు సమీపంగా ఉండేటట్టు తెలంగాణలో మద్యం ధరలను సవరించనున్నట్టు తెలిసింది. ఆ మేరకు పెంచే ధరల్లో సింహభాగం మద్యం కంపెనీలకే చెల్లించే విధంగా కసరత్తు జరుగుతున్నది. రెండు పక్కపక్క రాష్ర్టాల మద్యం ధరలు, డిస్టిరీలకు చెల్లింపులు, సుంకాలు ఒకే తరహాలో ఉంటే న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు. కాగ్ కూడా పోరుగు రాష్ట్రాల ఎమ్మార్పీ, బేసిక్ ధరలను సరిపోల్చి నివేదికలు రూపొందిస్తుంది. వచ్చే నెల మొదటి వారంలో పొరుగు రాష్ట్రం నూతన పాలసీ వెలువడే అవకాశం ఉంది. ఆ తరువాతనే తెలంగాణ ధరల నిర్ణయ కమిటీ అక్టోబర్ నెలాఖరులోగా నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుత చెల్లింపులు ఇలా..
దేశీయ మద్యం తయారీ కంపెనీలు (డిస్టిలరీలు) టీఎస్‌బీసీఎల్‌కు విక్రయించే ధరలను బట్టి చీప్ లిక్కర్, మీడియం లిక్కర్, ప్రీమియం లిక్కర్‌గా నిర్ధారిస్తారు. ఇవి కాకుండా విదేశీ మద్యం అదనం. డిస్టిలరీలకు చీప్ లిక్కర్‌పై పెట్టెకు (12 ఫుల్ బాటిల్స్) రూ. 450 లోపు, మీడియం లిక్కర్‌కు రూ. 750, ప్రీమియం లిక్కర్‌కు రూ. 750 కన్నా ఎక్కువగా టీఎస్‌బీసీఎల్ చెల్లిస్తున్నది. ప్రీమియం (స్ట్రాంగ్) బీర్ల పెట్టెకు రూ 313.78, లేగర్ (లైట్) బీర్ల పెట్టెకు రూ. 289.22 చొప్పున చెల్లిస్తున్నది. చీప్ లిక్కర్‌కు, బీరుకు బేసిక్ మీద రూ 100, మీడియం, ప్రీమియం మద్యం మీద రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా చెల్లించాలని మద్యం కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ మేరకు సామనుకూల నిర్ణయాలు తీసుకునే దిశగానే అడుగులు పడుతున్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి.