హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : ఏపీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్‌హౌస్‌లో అక్రమ మద్యంతోపాటు, రూ.11 కోట్ల నగదు డంప్‌ను సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఏ-40గా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు సోదాలు చేపట్టారు. వరుణ్, చాణక్య 12 పెట్టెలలో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకరించడంతో దాడులు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. 2024 జూన్‌లో ఈ మొత్తాన్ని దాచినట్టు అధికారులు వెల్లడించారు.
అధికారులకు పట్టుబడిన రూ.11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కెసిరెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఫాంహౌస్ యజమాని విజయేందర్‌రెడ్డికి పలు వ్యాపారాలు ఉన్నాయని చెప్పారు. ఇంజినీరింగ్ కాలేజీ, హాస్పిటల్స్ ఉన్నాయని, రూ.వందల కోట్ల టర్నోవర్ ఉందని తన అఫిడవిట్లో పేర్కొన్నారు.