Belt Shops | హైదరాబాద్, అక్టోబర్ 24 (నమప్తే తెలంగాణ): బెల్టు షాప్‌లను తొలగిస్తామన్న హామీతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నది. పది నెలల కాలంలో పల్లెల్లో 120 శాతం బె ల్టు షాపులు కొత్తగా ఏర్పడినట్టు తెలిసింది. ఉపాధి అ డిగిన ప్రతి కార్యకర్తకు స్థానిక ఎమ్మెల్యేలు బెల్టు దుకాణాలనే మార్గంగా చూపిస్తున్నారట. ఇటీవల ఓ అధికారిని ఆరా తీయగా రాష్ట్రంలో 1.75 లక్షల బెల్టు షాపులున్నట్టు వెల్లడించారు.
ఒకరి ఏరియాలోకి మరొకరు రావొద్దు
ఎక్సైజ్ అధికారులు ఏ4 దుకాణాల వారీగా గ్రామా లు, హద్దులు నిర్ణయించారు. ఒక దుకాణానికి కేటాయించిన గ్రామంలోని బెల్టు షాపుకు మరొక లైసెన్డ్స్ దుకాణదారుడు మద్యం అమ్మకూడదు. బాటిల్ పక్క మండలంలోని మద్యం దుకాణానికి చెందినది అని తేలితే ప్రైవేటు సైన్యం అక్కడికక్కడ మద్యం సీజ్ చేస్తుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మపూరంలో 2300 మంది జనాభా ఉండగా.. ఇక్కడ 10 బెల్టు షాపులున్నాయి. రోజుకు కనీసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వ్యాపారం జరుగుతుంది. ఎక్సైజ్ అధికారులు ఈ గ్రామాన్ని దుబ్బాక మండలం హబ్సీపూర్‌లో ఉన్న ఏ4 దుకాణానికి అనుసంధానం చేశారు. తిమ్మపూర్‌కు సమీపంలో సిద్దిపేట మెయిన్‌రోడ్డుపై ఇర్కోడ్ అనే మరో గ్రామం ఉంది. దుకాణదారులు సిద్దిపేట పట్టణానికి రాకపోకలు చేసే క్రమం లో ఇర్కోడ్ ఏ4 షాపులో మద్యం కొంటారు. ప్రైవేటు సైన్యాలు దీన్ని గుర్తించి, మద్యం సీసాలను జప్తుచేశా యి. గ్రామస్థులు అడ్డుకోవడంతో గొడవ అయింది.
రోజుకు రూ.86 కోట్ల వ్యాపారం
ఎక్సైజ్ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో రోజుకు రూ. 116 కోట్ల చొప్పున నెలకు రూ.3,500 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతున్నది. రోజుకు సగటున 70 ల క్షల సీసాల మద్యం అమ్ముడవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 2,620 రిటైల్ మద్యం దుకాణాలు, 1200 బార్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 615 రిటైల్ దుకాణాలకు పెద్దగా బెల్టు షాప్‌లు లేవు. మిగిలిన 2005 దుకాణాలకు 1.75 లక్షల బెల్టు షాపు లున్నాయి. ఒక్కో రిటైల్ షాపుకు అనుబంధంగా సగటున 85 బెల్టు షాపులు నడుస్తున్నాయి. మద్యం దు కాణాలు, బార్లలో కలిపి రూ.30 కోట్ల వ్యాపారం జరిగితే.. మిగిలిన రూ.86 కోట్ల మద్యం వ్యాపారం బెల్టు దుకాణాల ద్వారానే అవుతున్నది.
ఆంతర్యం ఇదే
ఏ4 రిటైల్ దుకాణంలో ఎమ్మార్పీకే మద్యం అ మ్మాలి. వ్యాపారులు లాభాల కోసం బెల్టు షాపుల మీద ఆధారపడుతున్నారు. బెల్ట్ షాపులకు క్వార్టర్ బాటిల్ ఎమ్మార్పీ మీద రూ.10, ఫుల్ బాటిల్‌కు రూ. 50 చొప్పున అదనపు ధరకు విక్రయిస్తున్నారు. ఇక బెల్ట్ షాప్ ఓనర్లు మరో రూ.10 నుంచి రూ.50 లాభానికి విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఎమ్మార్పీ మీద రూ.20 నుంచి రూ.100 వరకు ఉల్లంఘన జ రుగుతున్నది. అక్రమ మద్యాన్ని అరికట్టడమే కాకుం డా ఎమ్మార్పీ ఉల్లంఘను నివారించటం ఎక్సైజ్ శాఖ, జిల్లా టాస్క్‌ఫోర్స్ (డీటీఎఫ్), స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఎన్ఫోర్స్మెంట్ విభాగాల పని. కానీ ఈ విభాగాలన్నీ ఎమ్మార్పీ ఉల్లంఘనను అరికట్టలేకపోతున్నాయి. ఇందుకు వారికి ప్రతి నెలా మామూళ్లు అందటమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ స్టేషన్‌కు నెలకు రూ.25 వేలు, డీటీఎఫ్‌కు నెలకు రూ.12 వేలు, ఎస్టీఎఫ్కు 6 నెలలకు రూ.20 వేలు, స్థానిక పోలీసు స్టేషన్‌కు రూ.20 వేల చొప్పున రేటు ఫిక్స్ చేసినట్టు తెలిసింది.
యువత చేతిలోనే బెల్ట్ షాపులు
బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్న వారిలో 80 శాతం మంది పదో తరగతి నుంచి డిగ్రీలోపు చదువుకున్న యువకులే ఉన్నారు. ఉపాధి లేక, వ్యవసాయ పను లు చేసుకోలేక మద్యం వ్యాపారాన్ని ఎంచుకున్నామని సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన ఓ యు వకుడు చెప్పాడు. రూ.4 వేల నుంచి రూ.5 వేల పెట్టుబడి పెడితే అన్ని ఖర్చులు పోనూ రోజుకు కనీసం రూ.1200 నుంచి రూ.1500 వరకు మిగులుతాయని తెలిపాడు.