నిజామాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఖలీల్‌వాడి/డిచ్పల్లి: కుల వృత్తులను ప్రోత్సహించడంతోపాటు పేదల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సర్కార్ ముందుకెళ్తున్నదని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో రూ.2 కోట్లు, డిచ్పల్లి మండలం నడ్పల్లిలో రూ.50 లక్షలతో చేపల మార్కెట్ల నిర్మాణానికి గురువారం ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తాతో కలిసి శంకుస్థాపన చేశారు. మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలోని మాసాని చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకార్మిక సంఘాల సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మత్స్యకారులను సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలిపారు.
నీటి వనరులున్న చోట వంద శాతం సబ్సిడీపై చేపలు, రొయ్యల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో మత్స్య సంపద గణనీయంగా వృద్ధి చెందిందని చెప్పారు. ఈ క్రమంలో మార్కెటింగ్ వసతితో మత్స్యకార కుటుంబాలకు మరింత ఆర్థిక పరిపుష్టి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అవకాశమున్న చోట హోల్‌సెల్, రిటైల్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ తోడ్పాటుతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి రెట్టింపు అయ్యిందని పేర్క్నొరు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది మత్స్యకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నట్టు తలసాని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ నగరం, జిల్లా అత్యంత సుందరీకరణకు నోచుకుంటున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు రెండు రోజుల క్రితమే నిజామాబాద్ నగరంలోని 60 డివిజన్లకు రూ.60 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. త్వరలోనే ఆయా డివిజన్లలో పెండింగ్ పనులతోపాటు కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా నేతృత్వంలో పరిశీలన చేసి పూర్తి చేయనున్నట్టు చెప్పారు. నిజామాబాద్‌లో సుందరీకరణ పనుల నిమిత్తం సీఎస్ఆర్ కింద రూ.6 కోట్లను ఎమ్మెల్యేతో కలిసి సాధించినట్టు పేర్కొన్నారు
ఈ నిధులతో నిజామాబాద్‌లో 30 జంక్షన్లను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రవేశించే చోట డిచ్పల్లి రామాలయం మకర తోరణాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు వివరించారు. వెల్కమ్ టు నిజామాబాద్ సైన్ బోర్డుతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. ఇలాంటి స్వాగత తోరణాన్ని ఆర్మూర్ ప్రాంతంలోనూ జాతీయ రహదారి వెంట స్తూపం మాదిరిగా స్థాపించబోతున్నట్టు వెల్లడించారు. నిజామాబాద్‌లో జాబ్ మేళాలు నిర్వహించి నాలుగైదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు చెప్పారు.
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన అద్భుత పథకాలతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు కనిపిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిజామాబాద్‌లో 350 మత్స్య సహకార సంఘాలుంటే 22 వేల మంది మత్స్యకారులు సభ్యత్వాన్ని కలిగి ఉన్నారని చెప్పారు. ఇందులో 135 సొసైటీల్లో 4 వేల మంది మహిళలున్నట్టు ఆమె పేర్కొన్నారు. వీరికి మోపెడ్, కోల్డ్ స్టోరేజ్ ఆటోలు, కియోస్కోలు, చేపల విక్రయానికి అనువైన గొడుగులు, వలలు అందించినట్టు వెల్లడించారు. పోచంపాడ్ ఫిష్ బ్రీడింగ్ సెంటర్లో రూ.7 కోట్లతో అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. ఎనిమిదేండ్లలో నిజామాబాద్ జిల్లాలో రూ.22 కోట్లతో దాదాపుగా 25 కోట్ల చేప పిల్లలను అందించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన 43 వేల మంది ఆర్టీసీ కార్మికులకు కవిత శుభాకాంక్షలు తెలిపారు.