నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 18 : అకాల వర్షానికి రైతులు ఆగమవుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. సంగారెడ్డి జిల్లాలోని పలుచోట్ల శనివారం మధ్యాహ్నం వాన దంచికొట్టింది. కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకొచ్చిన రైతులు వర్షానికి ఇబ్బందిపడ్డారు. వడ్లను కాపాడుకోనేందుకు పట్టాల కోసం ఉరుకులు, పరుగులు పెట్టారు. అక్కడక్కడా రోడ్లపై వడ్లు ఆరబోసిన రైతులు ఆగమయ్యారు. నల్లగొండ జిల్లాలోని కట్టంగూర్ మండలంలో 65.5 మిల్లీమీటర్లు, మిర్యాలగూడలో 26.3 మిల్లీ మీటర్లు, దామరచర్లలో 17.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిర్యాలగూడ మండలంలోని జేత్యాతండాలో పిడుగు పడటంతో మాలోతు తావుర్యాకు చెందిన 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
తావుర్యాకు గాయాలు కాగా దవాఖానకు తరలించారు. వేములపల్లి మండలం ఆమనగల్లులో పిడుగుపడగా ఒకరికి గాయాలయ్యాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నల్లమల అమ్రాబాద్, జడ్చర్ల, భూత్పూరులో భారీగా, నాగర్కర్నూల్, గద్వాల, రాజాపూర్, తాడూరులో ఓ మోస్తరు వర్షం కురిసింది. జడ్చర్లలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మురుగు కాల్వలు నిండి పారడంతో పలు కాలనీల్లోకి నీరు వచ్చి చేరింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుణపురం మండలంలోని సీతారాంపురం, వెల్తుర్లపల్లి గ్రామాల మధ్యలోని మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు పరిసర ప్రాంతాల్లోని వరి పంట పొలా లు నీట మునిగాయి. నేలవాలిన వరిపంట చేతికందే దశలో నీటిలోనే మొలకెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 20 రోజుల్లో కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని విక్రయించే సమయంలో వర్షాలు తమ పాలిట శాపంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గణపురం మండల కేంద్రంతోపాటు కొండాపూర్, ధర్మారావుపేట, నగరంపల్లి, చెల్పూర్, బుద్ధా రం, మైలారంలో పంట నీట మునగడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
అకాలవర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీస్తున్నది. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వానలు రైతన్న కంటిమీద కునుకును దూరం చేస్తున్నాయి. కల్లాలు, కేంద్రాల్లోని వడ్లు కండ్లముందే తడిసి ముద్దవుతుంటే రైతుకంట కన్నీటి ధారలు వర్షిస్తున్నాయి. వడ్లు కొంటామన్న సర్కారు ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతుంటే అన్నదాత బతుకులు ఆగమవుతున్నాయి. కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో రెండురోజుల క్రితం కురిసిన వర్షానికి తడిసి మొలకలెత్తిన ధ్యాన్యాన్ని ఎత్తుతున్న మహిళా రైతు అనసూయ.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రం శివారులో మోరంచవాగు వరద నీటిలో మునిగిన వరి పొలం
కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో ఆరబోసిన వడ్లకు వచ్చిన మొలకలు
కామారెడ్డి జిల్లాలో ఆరబోసిన వడ్లకు వచ్చిన మొలకలు
సంగారెడ్డి జిల్లాలో వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యాన్ని కుప్ప చేస్తున్న రైతు
భూపాలపల్లి జిల్లా నగరంపల్లిలో నీట మునిగిన వరిపంటను చూపుతున్న మహిళా రైతు
శనివారం కురిసిన అకాల వర్షానికి సంగారెడ్డి శివారులోని చింతలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తడిసి రంగు మారిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతు