హైదరాబాద్ సిటీబ్యూరో/కోనరావుపేట/అబిడ్స్ / మేడిపల్లి/సుల్తానాబాద్ రూరల్, జూన్ 5: రాష్ట్రంలో బుధవారం ఈదురుగాలులతో కురిసిన వర్షానికి భారీ నష్టం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం సీతానగరంలో చెట్టు కింద పిల్లలు ఆడుకుంటుండగా పిడుగుపడి సంపత్(14) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు పిల్లలు స్పృహ కోల్పోగా దవాఖానకు తరలించారు. కరకగూడెం మండలం రంగాపురం-గొల్లగూడెం రహదారి పక్కన పిడుగుపాటుకు మూడు దుక్కిటెద్దులు మృతి చెందాయి.
జగిత్యాల జిల్లా బీమారం మండలం వెంకట్రావుపేటకు చెందిన గంగనర్సయ్య బుధవారం పొలంలో జీలుగు విత్తనాలు అలుకుతుండగా పిడుగుపడి మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వేములవాడ – సిరికొండ ప్రధాన రహదారిపై ఈదురుగాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు నేలకూలాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకులలో బుధవారం రాత్రి ఈదురుగాలులకు విద్యుత్తు వైర్లు తెగిపడి నూనె కనకయ్య(60)మృతి చెందారు. అతనితోపాటు నాలుగు గేదెలు కూడా మృత్యువాత పడ్డాయి.
హైదరాబాద్ అబిడ్స్ పరిధిలోని అల్లబండగుట్ట కింద ఉన్న ఇంటిపై పెద్ద బండరాయి పడడంతో ఇంట్లో నిద్రిస్తున్న రెండేండ్ల బాలుడు ఫరాన్ మృతి చెందాడు. బీహార్‌కు చెందిన మహ్మద్ షౌక్ దంపతులతోపాటు మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన చిన్నారులను నిలోఫర్ దవాఖానకు, మహ్మద్ షౌక్ దంపతులను ఉస్మానియా దవాఖానకు తరలించారు. మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ మహేశ్‌గౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జూరాల, ఆర్డీఎస్కు వరద
మూడు, నాలుగు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణ, తుంగభద్ర నదుల్లోకి స్వల్పంగా వరద వస్తున్నది. బుధవారం జూరాల డ్యాంకు 670 క్యూసెక్కులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. డ్యాం లో ప్రస్తుతం 314.910 మీ. నీటిమట్టం ఉంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద మొదలైంది. 7,952 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 7,952 క్యూసెక్కులు దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నట్టు ఏఈ రాందాస్ తెలిపారు. ఆనకట్టలో 8.9 అడుగుల నీటిమట్టం ఉన్నట్టు పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 430 క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్‌ఫ్లో 5 క్యూసెక్కులుగా నమోదైనట్టు టీబీ బోర్డు ఎస్ఈ నాగమోహన్, డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.