హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఇప్పటికే ధర్నాలతో దద్దరిల్లుతున్న రాష్ట్రంలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. సోమవారం సచివాలయాన్ని ముట్టడిస్తామని తెలంగాణ స్పెషల్ పోలీసు (టీజీఎస్పీ) కానిస్టేబుళ్లు హెచ్చరించడంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. విధుల్లో ఉన్న కొంతమంది బెటాలియన్ కానిస్టేబుళ్లను పక్కనపెట్టి.. ఎక్కడికక్కడే ఏఆర్ సిబ్బందితో నగరం నలువైపులా మోహరించింది. వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు బస్సులు, రైళ్లలో, మెట్రో రైలులో తనిఖీలు నిర్వహించింది. ఒక్క సచివాలయం పరిసరాల్లోనే సుమారు 508 మంది పోలీసు సిబ్బందిని డిప్లాయ్ చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం. దీంతో ప్లాన్ మార్చిన కానిస్టేబు ళ్లు..మెట్రోలో డీజీపీఆఫీసు ముట్టడికి యత్నిం చారు. బస్సుల్లో, ఆటోల్లో, మెట్రోరైళ్లలో కాని స్టేబుళ్లు డీజీపీ ఆఫీసును ముట్టడించేందుకు విఫలయత్నం చేశారు. లక్డీకపూల్ మెట్రోస్టేషన్ వద పోలీసులు మోహరించి, అరెస్టు చేసే ప్రయత్నం చేయడంతో మళ్లీ మెట్రోలోనే వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు.
పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా బెటాలియన్ కానిస్టేబుళ్లు వందలాదిమంది పోలీసుల ముందు ధర్నాచౌక్లో మెరుపు ధర్నా చేపట్టారు. పదుల సంఖ్యలో పోలీసుల ఆంక్షలను ఛేదించుకొని తమ నిరసన తెలిపారు. ‘టీజీఎస్పీ వద్దు.. ఏక్ పోలీస్ ముద్దు’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అప్పటికే ఇందిరాపార్క్ చుట్టుపక్కల మోహరించిన పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ మేరకు సీరియస్గా ఉన్న పోలీసులు.. వాళ్లను ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్లలో పడేశారు. అనంతరం వారిని స్థానిక పోలీస్స్టేషన్లకు తరలించారు.