హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆదివారం నుంచి ఈనెల 25 వరకు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్టు పేర్కొన్నది.
శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసినట్టు వెల్లడించింది.
ఖమ్మం జిల్లాలో గరిష్ఠంగా 37.4 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లాలో కనిష్ఠంగా 30.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. ఆది, సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైన మూడు వారాలు గడిచిచా.. రాష్ట్రంలో 43%లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. ఈనెల 1నుంచి శనివారం వరకు రాష్ట్రంలో వర్షపాతం 88.9 మి.మీ ఉండగా.. ఇప్పటివరకు 50.7 మి.మీ వర్షపాతమే నమోదైనట్టు పేర్కొన్నది. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని 621 మండలాల్లో కేవలం 17మండలాల్లో మాత్రమే 60శాతానికి పైగా వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో వనపర్తి జిల్లా పెబ్బేరులో 2.30 సెం.మీ, మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్లలో 1.81 సెం.మీ, నాగర్కర్నూల్ జిల్లా లింగాలలో 1.67 సెం.మీ, కొల్లాపూర్లో 1.54 సెం.మీ, నిజామాబాద్ జిల్లా నవీపేట్లో 1.66 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 1.61 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది.