హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా.. నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న మూడురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే పలు చోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నది. దీంతో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. గడిచిన 24గంటల్లో మహబూబాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయని తెలిపింది. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో 2.22 సెం.మీ వర్షపాతం నమోదైందని పేర్కొన్నది. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 1.89 సెం.మీ, చౌట్కూర్లో 1.86 సెం.మీ, అందోల్‌లో 1.42 సెం.మీ, ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్‌లో 1.49 సెం.మీ, తిరుమలాయపాలెంలో 1.37 సెం.మీ, సూర్యాపేట జిల్లా మద్దిరాలలో 1.24, యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో 1.04 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.