మేడిగడ్డ వద్ద రికార్డు స్థాయిలో 28లక్షల క్యూసెకుల వరద వచ్చినప్పుడే బ్యారేజీలు చెకు చెదరలేదు. ఇప్పుడు లక్ష క్యూసెకులకే ఏదో జరిగిపోతుందని భ్రమలు కల్పిస్తున్నరు. రిటైర్డ్ ఇంజినీర్ల సుదీర్ఘ అనుభవాన్ని, ఎల్ నినో కరువు హెచ్చరికలను పకనబెట్టి నీటిని ఒడిసిపట్టకపోవడం, ఏపీకి ఉదారంగా విడిచిపెట్టడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. తెలంగాణను కరువుబారిన నెట్టి చంద్రబాబు రుణం తీర్చుకునే రాజకీయాలు మానుకోవాలి. భవిష్యత్తులో తాగు, సాగునీటి గోసకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 10(నమస్తే తెలంగాణ) : ‘కండ్లముందే 60 టీఎంసీల నీళ్లు తరలిపోతున్నా సీఎం రేవంత్‌రెడ్డి చేతులు ముడుచుకొని కూర్చున్నారు.. చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే తెలంగాణ జలాలను ఏపీకి వదిలేస్తున్నారా? గోదావరిలో పుష్కలంగా జలాలు అందుబాటులో ఉన్నా, రాజకీయ కక్షతో మోటర్లు ఆన్ చేయకుండా రైతాంగానికి ద్రోహం చేస్తున్నారు. రేవంత్ వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రాకు వరంగా మారింది’ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గోదావరిలో వరదలు లేవని చెప్తున్న రేవంత్‌రెడ్డి, మరి పట్టిసీమ మోటర్లు నిరంతరాయంగా ఎలా నడుస్తున్నాయో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుషర ఎత్తిపోతల ద్వారా 24 మోటర్లను పూర్తిస్థాయిలో నడుపుతూ ఇప్పటికే 60 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తరలించుకుపోయిందని మండిపడ్డారు.
కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయని ముఖ్యమంత్రి తన చేతగానితనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య అంటూ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్‌పై పలు ప్రశ్నలు సంధించారు. ఒకవైపు చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం.. అంటూనే మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశం, అసహనంతో రగిలిపోతున్నావు? అని ముఖ్యమంత్రిని నిలదీశారు. రిటైర్డ్ ఇంజినీర్ల సుదీర్ఘ అనుభవాన్ని, ఎల్ నినో కరువు హెచ్చరికలను పకనబెట్టి నీటిని ఒడిసిపట్టకపోవడం, ఏపీకి ఉదారంగా విడిచిపెట్టడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కన్నెపల్లి మోటర్లు ఆన్ చేసి.. రిజర్వాయర్లన్నీ నింపాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌కు తాగునీటి ముప్పు
ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 5.48 టీఎంసీలే ఉన్నదని, ఇది డెడ్ స్టోరేజీ(3.32 టీఎంసీలు)కి చేరువలో ఉన్నదని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తాగునీటి సరఫరాకు 10 టీఎంసీలు, మిషన్ భగీరథకు 6.57 టీఎంసీలు, ఎన్టీపీసీ, పరిశ్రమలు, సాగునీటి అవసరాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరితే హైదరాబాద్‌కు రాబోయే తాగునీటి సమస్యకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రమాద ఘంటికలు మోగుతున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు.
రైతుల శాపం నుంచి తప్పించుకోలేరు
దేవాదుల ప్రాజెక్టులో పది మోటర్లు ఉన్నప్పటికీ రేవంత్ సరార్ మొక్కుబడిగా ఒకటీరెండు మాత్రమే నడుపుతున్నదని హరీశ్‌రావు విమర్శించారు. దేవాదుల నుంచి వృథాగా పోతున్న జలాలను ఏపీ వాడుకొంటున్నా, ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు పెదవులు మూసుకున్నారని, పదవులు అనుభవించడానికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. అటు నల్లగొండ జిల్లాలో సాగునీటి కోసం రైతులు ధర్నాలు చేస్తున్నా, నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ నిర్మించిన సీతారామ పంపుల ద్వారా ఖమ్మం రైతులకు నీళ్లు అందుతుంటే, దేవాదుల పంపులు ఆపడం వెనుక ఉన్న చీకటి ఒప్పందం ఏందని ప్రశ్నించారు. రైతుల కడుపుమీద కొట్టే రాజకీయాలు మంచివి కావని, తెలంగాణను కరువుబారిన నెట్టి చంద్రబాబు రుణం తీర్చుకునే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ భవిష్యత్తు తాగు, సాగునీటి గోసకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, తెలంగాణ రైతుల శాపం నుంచి ఈ ప్రభుత్వం తప్పించుకోలేదని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే కన్నెపల్లి పంపులను ఆన్ చేసి, అన్ని రిజర్వాయర్లను తక్షణమే నింపాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నిర్మించిన ఎత్తిపోతల వ్యవస్థను ఉపయోగించకుండా వదిలేయడం దుర్మార్గం. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే మోటర్లు సిద్ధంగా ఉన్నా కావాలనే ఆన్ చేయడం లేదు. బీఆర్ఎస్పై రాజకీయ ద్వేషంతో రైతులపై కక్షగట్టవద్దు. రిజర్వాయర్లు డెడ్స్టోరేజీలకు చేరుతున్నా ప్రభుత్వానికి పట్టదా? వెంటనే కన్నెపల్లి మోటర్లు ఆన్ చేయాలి. అన్నారం, సుందిళ్ల ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలించి అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ సహా అన్ని రిజర్వాయర్లను తక్షణమే నింపాలి. – హరీశ్‌రావు
రేవంత్‌రెడ్డీ.. మాట తప్పడం, పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి కావొచ్చు. కానీ, నాది కాదు. 20 ఏండ్ల్ల నీ రాజకీయ చరిత్ర, 25 ఏండ్ల నా రాజకీయ చరిత్రే అందుకు నిదర్శనం. నీలాగా ఒట్టేసి ఒక మాట, వేయకుండా మరోమాట చెప్పే అలవాటు నాకు లేదు. భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది? రాష్ట్రం సంగతి తర్వాత.. కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందా? సమాధానం చెప్పు?– హరీశ్‌రావు