హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ‘సీఎం రేవంత్ సారూ..నాకు రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇప్పించం డి.. లేకుంటే నేను బతుకుడు కష్టమే.. నన్ను కాపాడండి’ అంటూ ఓ రిటైర్డ్ ఏఎస్ఐ రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తున్నది. తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇప్పిస్తే మూత్రపిండాల చిక్సిత చేయించుకుంటానని ప్రాధేయపడటం ప్రతి ఒక్కరి హృదయాన్నీ కదిలిస్తున్నది. మొన్నటి వరకు శాంతిభద్రతలను కాపాడటానికి ఖాకీ దుస్తులు ధరించి బాధ్యతలు నిర్వర్తించిన ఆ పోలీసు ఇప్పుడు ‘నన్ను బతికించండి’ అంటూ వేడుకోవాల్సిన దయనీయ పరిస్థితి దాపురించింది. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఠాకూర్ నారాయణ్ సింగ్ 2024 ఆగస్టులో ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యారు. అతడు కిడ్నీల వైఫల్యంతో బాధపడుతున్నాడు.
చికిత్సకు డబ్బు లేకపోవడంతో తనకు రావాల్సిన బెన్ఫిట్స్ ఇప్పించాలంటూ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, సీఎస్‌లకు లేఖ రాశారు. తన కిడ్నీలు పాడయ్యాయని డయాలసిస్ చేయించుకునేందుకు డబ్బులు లేవని కన్నీటి పర్యంతమవుతున్నాడు. ‘రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బుతోనే నా డయాలసిస్ ఆధారపడి ఉన్నది. మీరు నిర్లక్ష్యం చేస్తే నేను బతుకుడు కష్టమే. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉన్నది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా’నంటూ లేఖలో ఆవేదన వ్యక్తంచేశాడు. హెల్త్‌కార్డు చెల్లుబాటు కావడం లేదని, ఏ దవాఖానలోనూ హెల్త్‌కార్డును ఆమోదించడం లేదని పేర్కొన్నాడు. తన కుటుంబానికి తానే పెద్దదిక్కని, ఇప్పుడు తనకు ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితి వచ్చిందని లేఖలో గోడు వెల్లబోసుకున్నాడు. ‘మీరు చేసే ఆలస్యం నన్ను చావుకు దగ్గర చేస్తున్నది. నాకు న్యాయం చేయండి’ అంటూ వేడుకున్నాడు. గతంలో తనకు రెండు సార్లు హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చిందని, తనను ఆదుకోవాలని మొరపెట్టుకుంటున్నాడు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం 8 వేల మంది ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు శాపంగా మారి ందని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. రెండు కిడ్నీలు చెడిపోయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక ంగా ఇబ్బందులు పడుతున్న ఠాగూర్ నారాయణసింగ్ దైన్యాన్ని ఉదహరించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డుతో చికిత్స చేసుకుందామని హాస్పిటల్‌కు వెళ్తే చెల్లదని పంపించటం దారుణమని, 30 ఏండ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ పరిస్థితి దయనీయంగా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం విశ్రాంత పోలీసు ఉద్యోగికి శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక్క నారాయణ సింగ్ సమస్యనే కాదని, రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ అయిన 8వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవన్మరణ సమస్య అని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌కు ఉద్యోగులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని, వైద్యసేవల్లో అంతరాయం కలగకుండా ఈహెచ్ఎస్, పోలీస్ ఆరోగ్య భద్రత కార్డులు దవాఖానల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.