కొత్తగూడెం అర్బన్, ఏప్రి ల్ 18 : పేదింటి యువతులకు రూ.1,00,116తోపాటు అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తులం బంగారం ఇప్పట్లో ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంశుక్రవారం జరిగింది. ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులకు జీతాలు ఇవ్వ డం కూడా ప్రభుత్వానికి కష్టంగానే ఉందని చెప్పారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ త్వరలోనే రాబోతున్నదని చెప్పారు. విమానాశ్రయం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి డోలాయామానంలో ఉందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎవరికీ రూపాయి ఇవ్వొద్దని, అర్హులకు అందేలా కృషి చేస్తానని మాటిచ్చారు.