కొడంగల్, నవంబర్ 26: ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని, పచ్చటి పంటలు పండే పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేయడం ఏమిటని ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు దస్రాం నాయక్ ప్రశ్నించారు. మంగళవారం ఎల్‌హెచ్‌పీఎస్ భారత ముక్తి మోర్చా, రాష్ట్రీయ ముస్లిం మోర్చా, జాతీయ ఓబీసీ సంఘాల ఆధ్వర్యంలో చలో కొడంగల్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంతో భూములు లాక్కుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని, రైతుల అభిప్రాయం మేరకు నడచుకోవాలని పేర్కొన్నారు. అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ఆంకాంక్ష ఉంటే ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. లగచర్లలో ఎకరానికి రూ.10లక్షలు ఇచ్చి పరిశ్రమలకు కట్టబెట్టాలని సూచించడం విడ్డూరంగా ఉందని చెప్పారు.
అర్ధరాత్రి కరెంటు తీసి అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. విచ్చలవిడిగా కేసులు పెట్టడంతో లగచెర్ల, హకీంపేట, పోలెపల్లి, రోటిబండతండా, పెలిచెర్లకుంటతండాలో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారని తెలిపారు. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌కుమార్ ధర్మ, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శాంతినాయక్, దళిత మహిళా నాయకురాలు ఉజ్వల, ఏమీసీ మోర్చా నాయకురాలు సంతోష, ఎల్‌హెచ్‌పీఎస్ గౌరవాధ్యక్షుడు గట్టిత నాయక్, జిల్లా అధ్యక్షుడు సూర్యనాయక్ పాల్గొన్నారు.