హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట 12 వాగ్దానాలు చేసిందని, వాటిని వెంటనే అమలుచేయాలని లంబాడీ హకుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) ‘నంగారా భేరి’ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్‌నాయక్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 12 అంశాలను అమలుచేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభలో ప్రకటించారని, మూడేండ్లు కావస్తున్నా ఇప్పటికీ ఒక్కటి అమలుచేయలేదని పేర్కొన్నారు.
హామీలు అమలుచేయకపోగా గిరిజనుల భూములను లాక్కుంటున్నదని ధ్వజమెత్తారు. గతంలో ఇంత పనికిమాలిన ప్రభుత్వాన్ని చూడలేదని విమర్శించారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని, లేకుంటే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. అంబేదర్ అభయహస్తంలోని 12 హామీల అమలు కోసం ఐక్య ఉద్యమాలు, పోరాటాలకు సిద్ధంగా ఉండాలని దళిత, గిరిజనులకు రాంబల్‌నాయక్ పిలుపునిచ్చారు.