హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ రుణానికి సిద్ధమైంది. ఈ నెల 15న రిజర్వ్ బ్యాంక్ నిర్వహించనున్న ఈ-వేలం ద్వారా రూ.7,500 కోట్లను అప్పుగా సమీకరించేందుకు ఆర్థికశాఖ ఇండెంట్ పెట్టింది. నాలుగు విడతల్లో సెక్యూరిటీ బాండ్లను జారీచేసి ఈ మొత్తాన్ని సమీకరించనున్నది.
ఇందులో 13 ఏండ్ల కాలపరిమితితో రూ.1,500 కోట్లు 7.53 శాతం వడ్డీకి, 18 ఏండ్ల కాలపరిమితితో రూ.2,000 కోట్లు 7.64 శాతం వడ్డీకి, 23 ఏండ్ల కాలపరిమితితో మరో రూ.2,000 కోట్లు, 29 ఏండ్ల కాలపరిమితితో రూ.2,000 కోట్లను 7.65 శాతం వార్షిక వడ్డీకి సమీకరించనున్నది. 2026-27లో ఆర్బీఐ వేలాల ద్వారా ప్రభుత్వం సమీకరించనున్న మొత్తం రుణం రూ.46,400 కోట్లకు చేరనున్నది. ఇదే సంవత్సరానికి కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితి రూ. 58, 458.71 కోట్లుకాగా, ఈనెల 15 నా టి కి అది రూ.46,400 కోట్లకు చేరనున్నది.