Congress Govt | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): గోదావరిని కొల్లగొట్టే కుట్రలపై నమస్తే తెలంగాణ వరుస కథనాలతో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారులో చలనం వచ్చింది. దీంతో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల తీరుపై రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఫిర్యాదులపై ఉదాసీనంగా వ్యవహరిస్తూ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని అసహనం వ్యక్తంచేశారు. ఆయన రెండు బోర్డులకు వేర్వేరుగా పలు అంశాలపై లేఖలు రాశారు. ఏపీ ప్రభు త్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల లింక్ (జీబీలింక్) ప్రాజెక్టు పనులను తక్షణమే అడ్డుకోవాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు రాసిన లేఖలో డిమాండ్ చేశారు. ప్రాజె క్టు పనులను నిలువరించడంలో బోర్డు పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
జీబీ లింక్ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అనేకసార్లు బోర్డుకు ఫిర్యాదుచేశామని గుర్తుచేశారు. ప్రాజెక్టు ప్రతిపాదనల దశలోనే ఉన్నదంటూనే ఏపీ ఇప్పటికే ప్రీ ఫీజిబిలిటీ అధ్యయనాల రిపోర్టును సమర్పించేందుకు సిద్ధమైందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగమైన బొల్లపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి ఏపీలోని ముంపు గ్రామాలపై ఇప్పటికే సర్వే చేయించినట్టు సమాచారం ఉన్నదని తెలిపారు. బోర్డు మాత్రం అవేవీ తమ దృష్టికి రాలేదని చెప్తూ చోద్యం చూస్తున్నదని చెప్పారు. తాము ఫిర్యాదుచేసినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని, కేంద్ర జల్‌శక్తి శాఖ వీఐపీ రిఫరెన్స్‌తో కాన్సెప్ట్ నోట్‌ను పంపించినా మెంబర్ స్టేటైన తెలంగాణకు సమాచారం ఇవ్వలేదని, మొత్తం గా బోర్డు తన విధులు నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైందని ఈఎన్సీ అనిల్‌కుమార్ పేర్కొన్నారు.
గోదావరి, కృష్ణా నదులపై కొత్త ప్రాజెక్టులు చేపడితే అప్పటికే నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యతను బోర్డు విస్మరించిందని అన్నారు. ఏపీ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుకోవాలని కోరారు. ల్యాండ్ సర్వే, టెండర్ల పనులను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. బనకచర్లతోపాటు పోలవరం ప్రాజెక్టులోని డెడ్‌స్టోరేజీ నీళ్లతో ఏపీ చేపట్టాలనుకుంటున్న లిఫ్ట్ ప్రాజెక్టును కూడా వెంటనే ఆపాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)తోపాటు జీఆర్ఎంబీకి ఈఎన్సీ జనరల్ మరో లేఖ రాశారు. డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని తీసుకెళ్లడం వల్ల గోదావరి డెల్టా సీమ్‌పై ప్రభావం పడుతుందని, తమ ప్రాజెక్టులకూ నీళ్లు దకవని ఆక్షేపించారు.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తీరుపై కూడా ఈఎన్సీ అనిల్‌కుమార్ అసహనం వ్యక్తంచేశారు. ఏకపక్షంగా నీటి విడుదలకు ఆదేశాలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులు మెయింటెయిన్ చేయాలని, అప్పుడే ఏఎమ్మార్పీ లిఫ్ట్ సీమ్‌కు నీటిని తీసుకునే వీలుంటుందని తాము పదే పదే కోరినా పట్టించుకోకుండా, 505 అడుగుల వరకూ నీటిని తీసుకెళ్లొచ్చంటూ ఏకపక్షంగా నిర్ణయించడమేంటని ప్రశ్నించారు. వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలని తెలంగాణ కోరినా పట్టించుకోలేదని, కానీ ఏపీ 10 టీఎంసీలు కావాలని అడగ్గానే ఆగమేఘాలపై వాటర్ రిలీజ్ ఆర్డర్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
ఏపీ అడిగిందే తడవుగా ఆర్డర్లు ఇస్తున్న బోర్డు, తెలంగాణను మాత్రం లెక చేయడం లేదని, ఇది ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 510 అడుగులకు ఎగువన 4.458 టీఎంసీల నీళ్లే ఉన్నాయని, ఏపీకి నీటిని ఇచ్చేస్తే తెలంగాణ పరిస్థితి ఏమిటి? ఏఎంఆర్పీకి నీళ్లు ఎలా? అని బోర్డును ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి విడుదల గురించి రిలీజ్ ఆర్డర్లో కనీసం ప్రస్తావించలేదని, ఇకనైనా రిలీజ్ ఆర్డర్‌ను సవరించి మళ్లీ ఇవ్వాలని, సాగర్‌లో 510 అడుగుల కనీస మట్టాన్ని మెయింటెయిన్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.